Best Web Hosting Provider In India 2024

Auto Drivers Protests in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మీ’ పథకంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే కొన్నిచోట్లా శనివారం ఆటో డ్రైవర్లు బంద్ పాటిస్తున్నారు. ఈ మేరకు రోడ్డెక్కి నిరసనలు చేపట్టడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని రద్దు చేసి తమను ఆదుకోవాలంటూ అధికారులను వినతి పత్రాలు ఇస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
వారం రోజులుగా నిరసనలు
కాంగ్రెస్ అధికారంలోకి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేయగా.. మొదట మహాలక్ష్మీ పథకం అమలుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. ఈ మేరకు ఆ పథకంలో భాగంగా సోనియా గాంధీ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీని ప్రారంభించారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఎక్కే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. కాగా స్కీం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,200 బస్సులు వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
రికార్డ్ స్థాయిలో మహిళల జర్నీ
ఇదివరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్ సేవలు వినియోగించుకునే వారు. కానీ ఫ్రీ జర్నీ స్కీం తెచ్చిన తరువాత ఆటోల మీద ఆధారపడిన మహిళలు కూడా ఇప్పుడు ఉచిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్ లు ఎక్కుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్ లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇదివరకు 14 మంది మహిళలు ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటే.. గత సోమవారం రికార్డ్ స్థాయిలో 50 లక్షల మంది, ఆదివారం 41 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే గతంతో పోలిస్తే దాదాపు మూడు, నాలుగు రెట్లు మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఆటో డ్రైవర్ల ఆందోళనలు
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 లక్షల కుటుంబాలు ఆటోలపై ఆధారపడి ఉన్నాయని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. గతంలో ఆటోలను ఎక్కే వాళ్లంతా ఇప్పుడు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుండటంతో ఆటోలకు గిరాకీ పెద్దగా లేకుండా పోయింది. దీంతోనే స్కీం ప్రారంభించినప్పటికీ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేపడుతున్నారు. ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం అవుతున్నాయని, వెంటనే మహిళలకు ఫ్రీ జర్నీ పథకాన్ని క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ధర్నాలు చేపడతామని, చలో హైదరాబాద్ నిర్వహించి ప్రజా భవన్ ను ముట్టడిస్తామని ఆటో డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించడం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వెంటనే ఆ పథకాన్ని రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆటో డ్రైవర్లు శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వారం రోజులుగా సరైన ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలు తప్పవని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, పరకాల, కమలాపూర్, వర్ధన్నపేట తదితర చోట్లా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పథకాన్ని రద్దు చేసి తమను ఆదుకోవాలని కోరుతూ స్థానిక అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. వారం రోజులుగా ఆటో డ్రైవర్లు ఇలా ఆందోళనలు కొనసాగిస్తుండగా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
రిపోర్టింగ్ : హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి
సంబంధిత కథనం