Best Web Hosting Provider In India 2024

మధ్యాహ్నం భోజనం అయిన రెండు మూడు గంటల తర్వాత ఎవ్వరికైనా సరే ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో వీధుల్లో బండ్లు పెట్టి అంతా రకరకాల చిరు తిండ్లను తయారు చేసి అమ్ముతుంటారు. వాటిలో ఎక్కువగా బజ్జీలు, పకోడాలు, సమోసాల్లాంటివి ఉంటూ ఉంటాయి. లేదంటే ఇంట్లో అయినా సరే చిరు తిండ్లుగా నూనెల్లో వేపించి తీసిన కారప్పూసలు, అప్పడాలు, చిప్స్ లాంటివే ఉంటూ ఉంటాయి. అయితే ఇలా కాక నూనెల్లో వేపించి తీసిన పదార్థాల వల్ల మనలో చెడు కొలస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే ఈ సమస్యతో ఉన్న వారు మళ్లీ ఇలాంటివి తింటూ ఉంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి అస్సలు కొలస్ట్రాల్ లేకుండా ఉండే కొన్ని భారతీయ చిరు తిండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రెండింగ్ వార్తలు
మూరీ మిక్స్చర్:
మరమరాల్లో ఉల్లిపాయలు, టమాటాలు, ఉడికించిన బఠాణీ, కొత్తిమీర, నిమ్మరసాలను బాగా కలిపి తయారు చేసే మరమరాల మిక్చ్సర్ అంటే తెలుగు వారందరికీ ఎంతో ఇష్టం. ఇది అస్సలు నూనె లేకుండానే తయారు చేసుకోవచ్చు. సరదాగా సాయంత్రం పూట తినడానికి మంచి టైంపాస్ స్నాక్‌లా ఉంటుంది.
శెనగల చాట్:
ప్రొటీన్‌లు పుష్కలంగా లభించడానికి శెనగల చాట్ తినవచ్చు. కనీసం నాలుగు గంటల పాటు శెనగల్ని నానబెట్టాలి. తర్వాత వాటిని ఒకసారి కడిగి కుక్కర్లో వేసి తగినంత నీరు, ఉప్పు వేసి మూత పెట్టాలి. స్టౌ వెలిగించి కుక్కర్ నాలుగైదు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి శెనగల్ని బటయకు తీయాలి. దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం వేసుకుని కలుపుకుని తింటే.. అదుర్స్ అనాల్సిందే.
మొలకల చాట్:
మీకు నచ్చిన కొన్ని రకరకాల గింజల్ని తీసుకోవాలి. వాటిని మొలకలు కట్టి తీసుకోవాలి. ఆ స్ప్రౌట్స్‌ని కుక్కర్లో వేసి, నీరు, ఉప్పు చేర్చి మూడు విజిల్స్ రానివ్వాలి. తర్వాత వాటిని తీసుకుని అచ్చంగా శెనగల చాట్ మాదిరిగా ఉల్లి, కొత్తిమీర, టమోటా, క్యారట్ తదితర తరుగుల్ని వేసుకుని నిమ్మరసం పిండుకుంటే మొలకల చాట్ రెడీ అయిపోతుంది. కావాలనుకుంటే దీనిలో కాస్త ఛాట్ మసాలా కూడా వేసుకోవచ్చు.
బెల్లం అటుకులు:
అమ్మమ్మల కాలం నాటి బెల్లం అటుకుల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అటుకుల్ని ఒకసారి నీరు పోసి కడిగి వెంటనే ఒంపేయాలి. అందులో కాస్త కాచిన పాలు పోసి నాననివ్వాలి. అవి అటుకులకు పట్టేంత మాత్రమే పోయాలి. ఎక్కువ కాదు. అందులో బెల్లంపొడి, యాలుకల పొడి వేసి కలిపి పావు గంట సేపు పక్కనుంచాలి. తర్వాత అది తినడానికి రెడీ అయిపోయినట్లే. ఎంతో సింపుల్‌గా చేసుకునే ఈ చిరుతిండ్లు ఇటు ఆరోగ్యానికీ మంచిదే. చెడు కొలస్ట్రాల్ మనలోకి చేరకుండానూ ఉంటుంది. ప్రయత్నిస్తారా మారి?