
Best Web Hosting Provider In India 2024
Sunday Motivation: ప్రపంచంలో గలగల మాట్లాడేవారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఎదుటి వారు చెప్పింది వినే వారి సంఖ్య చాలా తక్కువ. అందుకే ప్రపంచంలో సక్సెస్ అయిన వారి సంఖ్య కూడా తక్కువే. విజయానికి, నిశ్శబ్ధానికి విడదీయరాని సంబంధం ఉంది. ప్రపంచ మేధావులను ఎవరినైనా గమనించండి. వారు మాట్లాడేది తక్కువ… చేతలు ఎక్కువ.ఎదుటి వారు చెప్పేది వినే కళ మీకుందంటే అర్థం మీకు సహనం ఎక్కువని. సహనం, ఓపిక ఉన్న వారు కాస్త ఆలస్యం అయినా కచ్చితంగా విజయం సాధిస్తారు.
ట్రెండింగ్ వార్తలు
‘తెలివితక్కువ వాడిని అతని మాటల ద్వారా గుర్తిచవచ్చు… తెలివైన వాడిని అతని నిశ్శబ్ధాన్ని బట్టి గుర్తించవచ్చు…’ – ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రీకు శాస్త్రవేత్త ఫైథాగరస్ చెప్పిన వాక్యాలివి. ఎవరికైనా సరే ఎప్పుడు, ఎక్కడ, ఎంత సేపు మాట్లాడాలి అనే విషయం తెలిసి ఉండాలి. అలా తెలిసిన వాడే తెలివైన వాడు. ఆ తెలివి తేటలు లేకుండా అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడేవాడికి విలువ ఉండదు. అతని మాటలను కూడా కొట్టి పడేసే వారే ఎక్కువ. లోకంలో విజయం సాధించిన ప్రతి వ్యక్తి బయోగ్రఫీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి… అతను తన మాటలను ముత్యాల్లాగే వాడేవాడు.
ఎదుటివారు ఏదో చెప్పేలోగానే పది మాటలు మాట్లాడే బాపతులు ఎక్కువ. ఇలాంటి వారు విజయం అందుకునే ప్రయాణంలో మధ్యలోనే ఆగిపోతారు. వారి మాటలే శాపాలై సమస్యలను తెచ్చిపెడుతాయి. అధికంగా మాట్లాడడం వల్ల వచ్చే సమస్యను తీర్చుకోవడంలోనే సమయం గడిచిపోతుంది. నిశ్శబ్ధంగా ఉండడం వల్ల ఎదుటి వారు ఎలాంటి వారో, వారు చెప్పే దాంట్లో ఎంత లోతైన అర్థం ఉందో మెదడు అంచనా వేయగలదు. అధికంగా మాట్లాడడం వల్ల మెదడు శక్తి కూడా సన్నగిల్లుతుంది. నిశ్శబ్ధంగా ఉండడం వల్ల మెదడు తన శక్తిని ఆలోచనలకే కేటాయిస్తుంది. దీని వల్ల మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
మాట్లాడకపోవడమూ తప్పే…
‘అనువుగాని చోట అధికులమనరాదు’ అని ఊరకే చెప్పలేదు. అవసరం లేని చోట అధికంగా మాట్లాడడం ఎంత తప్పో, అవసరమైన చోట మాట్లాడకపోవడమూ అంతే నష్టం చేస్తుంది. కొంతమంది తాము తెలివైన వాళ్లమని చెప్పుకోవడానికి మాట్లాడుతూనే ఉంటారు, ఎదుటివారి మాటలకు అడ్డుతగులుతూ ఉంటారు. ప్రపంచంలో గొప్పగా ఎదిగిన వారెవ్వరికీ ఇలాంటి అలవాటు ఉండదు.
ప్రతి ఒక్కరి జీవితంలో చిన్న చిన్న తగాదాలు, గొడవలు సహజం. ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉన్నవారి జీవితంలో అవి మరింత ఎక్కువగా అవుతాయి. అదే నిశ్శబ్ధంగా ఉండే వారి జీవితంలో ఆ గొడవలు మొక్కగా ఉండగానే మానిపోతాయి. మాట తూటాతో సమానం. వదిలితే వెనక్కి తీసుకోలేం. ఒక్కోసారి అవి చేసే నష్టం కూడా భారీగానే ఉంటుంది. కాబట్టి ఓపిక పెంచుకోండి. మాటలు తగ్గించండి. ఎదుటివారు చెప్పేది వినడం అలవాటు చేసుకోండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది.