
Best Web Hosting Provider In India 2024
Vijayawada YCP Mlas: విజయవాడ వైసీసీ ఎమ్మెల్యేలకు కొత్త భయం పట్టుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ నియోజక వర్గం నుంచి మల్లాది విష్ణు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో టిక్కెట్ల కోసం వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది.
ట్రెండింగ్ వార్తలు
రాష్ట్రంలో చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం, మార్పు తప్పదని ఇప్పటికే వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పేసింది. దశల వారీగా నెలాఖరులోగా అన్ని నియోజక వర్గాల అభ్యర్థుల్లో క్లారిటీ రానుంది. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచలనం, మరికొన్ని చోట్ల మొండిచేయి తప్పట్లేదు.
ఈ క్రమంలో విజయవాడలో ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరి భవితవ్యం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేసి గెలిచారు. 2009లో తొలిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికైన వెల్లంపల్లి 2014లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో విజయవాడ పశ్చిమలో గెలిచిన వైసీపీ అభ్యర్ధి జలీల్‌ఖాన్ ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వెల్లంపల్లి ఎన్నికల్లో గెలిచి మంత్రి కూడా అయ్యారు.
బీజేపీతో పాటు, స్వామిజీలు, పీఠాధిపతులతో ఉన్న సత్సంబంధాలకు మంత్రి వెల్లంపల్లికి కలిసొచ్చాయనే ప్రచారం ఉంది. రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి టీడీపీ – జనసేన కూటమి పోటీ చేస్తే అందుకు అనుగుణంగా వైసీపీ కూడా తమ అభ్యర్ధిని పోటీలో ఉంచాలని భావిస్తోంది. కుల సమీకరణలు, సామాజిక ఎత్తుగడలు, సిట్టింగ్ అభ్యర్ధి పనితీరు, ప్రజల్లో ఉన్న సానుకూలతల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి స్థానంలో మైనార్టీ అభ్యర్ధిని బరిలో దింపుతారనే ప్రచారం ఆ పార్టీలో జరుగుతోంది. టీడీపీ-జనసేన కూటమి తరపున నియోజక వర్గంలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న వర్గానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే ఆ తర్వాత స్థానంలో ఉన్న మైనార్టీలకు వైసీపీ చోటు కల్పించే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడ మేయర్‌గా పనిచేస్తున్న రాయన భాగ్యలక్ష్మీ, కార్పొరేటర్ బండి పుణ్యశీల వంటి వారు కూడా పశ్చిమ టిక్కెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
వెల్లంపల్లి వర్గంగా ముద్రపడిన మేయర్ పేరు కూడా వినిపిస్తున్నా, మేయర్ భర్త అధికారాన్ని చలాయిస్తుండటంపై స్థానికంగా వ్యతిరేకత ఉందని సర్వేల్లో గుర్తించారు. దీంతో మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారు. ఈ పరిణామాలన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లికి మింగుడు పడటం లేదు. వెల్లంపల్లి అనుచరులు మాత్రం తమ నాయకుడికి మళ్లీ అవకాశం లభిస్తుందని బలంగా నమ్ముతున్నారు. స్థానికంగా సొంత సామాజిక వర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకత కూడా వెల్లంపల్లి అవకాశాలను తగ్గిస్తోంది.
మల్లాది విష్ణుది అదే దారి…!
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కూడా ఈసారి టిక్కెట్ దక్కడంపై అనుమానాలు ఉన్నాయి. విష్ణు స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన పుణ్యశీల టిక్కెట్ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజక వర్గాల్లో అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని అభ్యర్ధించినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్న పుణ్యశీల తన భర్త రాజ్‌కుమార్‌కు తాడికొండ టిక్కెట్ కోసం ప్రయత్నించినా అవి ఫలించలేదు.
2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది విష్ణు 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ నుంచి రెండోసారి గెలిచారు. మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని భావించినా సామాజిక సమీకరణల నేపథ్యంలో కోన రఘుపతికి అవకాశం దక్కింది. మంత్రి వర్గ విస్తరణలోనైనా తనకు అవకాశం ఇస్తారని విష్ణు భావించినా అది నెరవేరలేదు. తాజాగా ఆయనకు సీటు కూడా ఇస్తారో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సామాజిక సమీకరణల నేపథ్యంలో బ్రాహ్మణ వర్గం నేతలతో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో తమ వర్గానికి నామమాత్రపు ప్రాతినిథ్యం ఉందని వైసీపీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలి.
దీంతో విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సెంట్రల్‌లో గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన గౌతమ్ రెడ్డి వంటి వారు కూడా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో కార్పొరేటర్‌గా ఉన్న జానారెడ్డి, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం ఖాయమని వారి స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది.