Best Web Hosting Provider In India 2024

ఆరోగ్యంపై శ్రద్ధతో చాలా మంది రోజూ నడవడం, బ్రిస్క్ వాకింగ్ చేయడం, వ్యాయామాలు చేయడం లాంటి వాటిని చేస్తూ ఉంటారు. అయితే ఇలా అధికంగా వ్యాయామం చేసిన తర్వాత చాలా మందికి నీరసంగా అనిపిస్తుంది. దీంతో మళ్లీ బాగా తినడం మీద దృష్టి పెడతారు. అలా వారు కొద్ది సేపటి ముందే కరిగించుకున్న క్యాలరీలను తిరిగి తినేస్తున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాయామం తర్వాత శక్తిని తిరిగి పొందడానికి మళ్లీ అతిగా తినొద్దని సూచిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
వ్యాయామం తర్వాత అతిగా తినకూడదంటే..:
- మనలో చాలా మంది రోజులో రెండు సార్లు కడుపునిండా భోజనం చేస్తాం. అంటే ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటాం. మిగిలినప్పుడు చిన్న చిన్న పరిమాణంలో చిరు తిండ్లను తింటూ ఉంటాం. అయితే వ్యాయామ సమయాన్ని ఇలా భోజన సమయానికి ముందు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు నీరసంగా అనిపించినా భోజనం చేసేస్తాం కాబట్టి మళ్లీ సాధారణంగా శక్తిని పొందగలుగుతాం.
- ఇలా భోజన సమయాలకు ముందు కాకుండా ఇతర సమయాల్లో వ్యాయామం చేసినా అతిగా తినకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. కొంత మంది ఎక్కువ సేపు కష్టపడి వ్యాయామం చేసిన తర్వాత ఓ కప్పు ఐస్ క్రీం తినడమో లేదంటే స్వీట్లు తినడం లాంటివో చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మళ్లీ అధికంగా క్యాలరీలను లోపలికి పంపించినట్లు అవుతుంది. కోల్పోయిన క్యాలరీలు తిరిగి శరీరంలోకి వచ్చేస్తే ఇక చేసిన దానికి ఉపయోగం లేకుండా పోతుంది.
- ఒక వేళ ఇలా వ్యాయామం తర్వాత భోజనం తినాలనుకునే వారు దానిలో ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందువల్ల తొందరగా కడుపు నిండిపోయి ఎక్కువ తినకుండా ఉంటాం. అలాగే కార్బోహైడ్రేట్ల వల్ల శక్తి కూడా పుంజుకుంటాం.
- భోజన సమయాలకు దగ్గర్లో మీరు వ్యాయామం చేయడం లేదనుకున్నప్పుడు మరో విధానాన్ని పాటించ వచ్చు. వ్యాయామం తర్వాత ఎక్కువగా తినాలని అనిపించకుండా ఉండాలంటే అంతకు ముందే కొన్ని కొవ్వులు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లు, ప్రొటీన్‌లు ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే వ్యాయామం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే చిన్న స్నాక్‌లా వీటిని తినాలి. ఉదాహరణకు గుడ్డు, సలాడ్ లాంటివి తీసుకోవచ్చు.
- వ్యాయామం చేసేంత సేపూ కొద్ది కొద్దిగా నీటిని తాగుతూ ఉండండి. దీంతో ఒక్కసారిగా శక్తిని కోల్పోయినట్లు, ఆకలవుతున్నట్లు అనిపించదు.