Best Web Hosting Provider In India 2024

పెద్దవాళ్లల్లో విటమిన్ డీ లోపం ఉంటే శరీరం ఇచ్చే కొన్ని సూచనల ద్వారా వాటిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఎముకల నొప్పులు, నిద్ర లేమి, అలసట, కండరాల నొప్పులు, బలహీనత లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే చిన్న పిల్లల్లో ఇవేమైనా ఉన్నా కూడా వారికి దీన్ని చెప్పడం రాదు. కాబట్టి వారిలో డీ విటమిన్ లోపం ఉందని మనం ఎలా గుర్తించగలుగుతాం? దాని నుంచి వారిని బయట పడేయడానికి ఏమేం చేయవచ్చో నిపుణులు సూచిస్తున్నారిక్కడ.
ట్రెండింగ్ వార్తలు
డీ విటమిన్ లోపాన్ని సూచించే లక్షణాలు :
ఎదిగే పిల్లల్లో విటమిన్ డీ లోపం అనేది చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. నడుం నొప్పి, తగిలిన దెబ్బలు తొందరగా తగ్గక పోవడం, జుట్టు ఊడిపోవడం లాంటివి జరగవచ్చు. పళ్లు బలహీనంగా ఉండటం కనిపిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనమై తరచుగా రక రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. రోజు వారీ శరీర క్రియలు పిల్లల్లో సజావుగా జరగాలంటే కచ్చితంగా డీ విటమిన్ అవసరం. అందుకనే పై లక్షణాలు కనిపించినట్లైతే వీరిలో ఈ లోపం ఉందని అనుమానించాలి. నిర్థారణ పరీక్షలు చేయించి దాన్ని గుర్తించాలి.
ఎవరికి ఈ లోపం వస్తుందంటే :
ఎక్కువగా ఎండ తగలకుండా ఇంట్లో ఉండే శిశువులు, ఐదేళ్ల లోపు వారు, అలాగే ఐదేళ్లు పైబడిన పిల్లల్లో కూడా ఎక్కువగా ఈ లోపం ఉండవచ్చు. వయసు, అలాగే లోపం ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్ని బట్టి దుష్ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది ఆధార పడి ఉంటుంది. కాళ్లు వంకర్లు తిరగడం, పుర్రె దగ్గర సొట్ట పడటం, ఎముకల వైకల్యాలు, కండరాలు బలం లేకుండా ఉండటం లాంటివి కనిపిస్తాయి.
పరిష్కారం ఎలా :
విటమిన్ డీ లోపాన్ని మందులతో, మందులు వాడకుండా కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. వైద్యుడిని సంప్రదిస్తే వారు విటమిన్ డీ, కాల్షియం ట్యాబ్లెట్లను సూచిస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడితే ఇది సరైపోతుంది. ఇది ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్. కాబట్టి అవసరానికి మించి అధికంగా వాడకూడదన్న విషయాన్నీ గుర్తుంచుకోవాలి.
ఇక మందుల అవసరం లేకుండానూ దీని నుంచి బయట పడొచ్చు. పిల్లల్ని ఎక్కువగా ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలి. డీ విటమిన్ దొరికే చేపలు, గుడ్లు, పుట్ట గొడుగులు, సెరెల్స్, పండ్ల రసాల్లాంటి వాటిని ఇవ్వడం ద్వారా ఈ లోపం సరవుతుంది.