Best Web Hosting Provider In India 2024

Movies for Weight loss: వ్యాయామాలు చేసే కాదూ సినిమాలు చూసీ బరువు తగ్గొచ్చట. ఎలాంటి సినిమాలు చూస్తే కేలరీలు ఎక్కువగా ఖర్చవుతాయో తెలిపే పరిశోధన గురించి వివరంగా తెల్సుకోండి.
చాలా మంది బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతుంటారు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు, కచ్చితమైన ఆహార నిబంధనలు పెట్టుకుని కష్టపడుతుంటారు. అయితే శరీరంలో క్యాలరీలు కరిగించుకోవడానికి కొన్ని వెరైటీ మార్గాలూ ఉన్నాయి. కేవలం 90 నిమిషాల పాటు ఓ మాంచి హారర్ మూవీ చూస్తే దాదాపుగా 150 క్యాలరీలు వరకు కరుగుతాయట. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మిన్‌స్టర్ వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.
ట్రెండింగ్ వార్తలు
ఏ సినిమాలు చూస్తే కెలరీలు తగ్గుతాయి?
లవ్ బేస్డ్ సినిమాలను చూడటం కంటే బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా హారర్ సినిమాలు చూడటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. అందులో ఉన్న సన్నివేశాలు మనలను ఒకింత కంగారుకు గురి చేస్తాయి. కాస్త భయ పెడతాయి. హఠాత్తుగా జరిగే పరిణామాలకు మనలో అడ్రినలైన్ అనేది విడుదల అవుతుంది. అందువల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరం అంతా రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. వీటన్నింటి వల్ల జీవక్రియ వేగంగా జరుగుతుంది. అందువల్ల 150 వరకు క్యాలరీలను శరీరం అదనంగా ఖర్చు చేస్తుంది. అదే సాధారణ సినిమా చూడటం వల్ల ఇదంతా జరగదు. కాబట్టి పరిశోధకులు హారర్ సినిమాలు బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయని తేల్చారు.
ఈ పరిశోధకులు కొన్ని హారర్ సినిమాలను కొంత మందికి చూపించి చూశారు. ద షైనింగ్ అనే హారర్ సినిమాని చూసిన వారిలో సరసరిన అత్యధికంగా 184 క్యాలరీలు వరకు కరిగాయట. అదే జాస్ అనే సినిమాని చూస్తే 161 క్యాలరీలు, ద ఎక్సోర్‌సిస్ట్ అనే దానికి 158 క్యాలరీలు చొప్పున కరిగాయి. ఈ సినిమాల్లో భయపెట్టే దృశ్యాలు, జంపింగ్‌ల్లాంటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటిని చూసిన వారిలో గుండె కొట్టుకునే రేటు, అడ్రినలైన్ స్థాయిలు పెరిగిపోయి తద్వారా క్యాలరీలు కరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. మనం ఎక్కువగా భయం, ఆందోళనల్లో ఉన్నప్పుడు ఒత్తిడికి గురవుతాం. ఇలాంటి హఠాత్పరిణామాలకి అడ్రినలైన్ విడుదల ఎక్కువగా జరుగుతుంది. దీంతో క్యాలరీలు కరుగుతాయి.
అయితే బరువు తగ్గాలని అనుకునే వారు చక్కని ఆహారపు అలవాట్లు చేసుకుని మంచి డైట్‌ని అనుసరించాలి. రోజు వారీ వ్యాయామాలూ చేసుకోవాలి. వీటికి తోడు ఇలాంటి హారర్ మూవీలు చూస్తే ఫలితాలు బాగుంటాయి. బరువు తొందరగా తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేగాని అవేం చేయకుండా ఒక్క సినిమాలు మాత్రమే చూస్తే బరువు అంత తొందరగా తగ్గరని గుర్తుంచుకోవాలి. కాబట్టి వెయిట్ లాస్ ప్రయత్నాల్లో ఉన్నవారంతా వారి రోజు వారీ కార్యకలాపాల్లో అప్పుడప్పుడు హారర్ సినిమాల్ని చూడటం కూడా అలవాటు చేసుకోవచ్చు.