Best Web Hosting Provider In India 2024

పాలను సంపూర్ణ ఆహారం అంటారు. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం, కాల్షియం, జింక్, థయామిన్, విటమిన్ ఏ, విటమిన్ డీ, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు.. లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకనే రోజూ ఒక గ్లాసు పాలు తాగమని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. ఇవి మనకు తక్షణ శక్తిని ఇస్తాయి. మధుమేహం, గుండె జబ్బుల్లాంటి వాటిని రాకుండా చూస్తాయి.
ట్రెండింగ్ వార్తలు
అనేక లాభాలు ఉండే పాలను తాగడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా పిల్లలు వీటిని తాగం అని మారాం చేస్తూ ఉంటారు. అయితే పాలలో కలుపుకుని తాగేందుకు మార్కెట్లో రక రకాల పౌడర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఎప్పటి నుంచో వీటిని చాలా ఇళ్లల్లో వాడుతూ వస్తున్నారు. అయితే వాటికి బదులుగా ఇంట్లో దొరికే ఈ పదార్థాలను చేర్చి చూడండి. రుచితోపాటు ఆరోగ్యమూ మన సొంతం అవుతుంది. అవేంటో తెలుసుకుందాం రండి.
బెల్లం:
ఇంట్లో పాలను చాలా మంది పంచదార వేసుకుని తాగుతూ ఉంటారు. అయితే దాని వల్ల ఏ మాత్రమూ ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. కాబట్టి పంచదారకు బదులుగా బెల్లం వాడే ప్రయత్నం చేయండి. బెల్లం పొడిని రోజూ పాలలో వేసుకుని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మరిన్ని పోషకాలు అందుతాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. పొట్ట నొప్పులు, మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనమూ లభిస్తుంది.
అల్లం:
పాలల్లో అల్లం తురుమును వేసుకుని కాచుకుని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దగ్గు, జలుబు, వికారం లాంటివి తగ్గుతాయి. అలాగే అల్లంలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాల వల్ల పొట్టలో ఉండే వాపులు తగ్గి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కను పొడి చేసుకుని చిన్న డబ్బాలో వేసుకుని పెట్టుకోవాలి. గోరు వెచ్చగా పాలు తాగాలని అనుకున్నప్పుడు అందులో చిటికెడు ఈ పొడి వేసి కలుపుకోవాలి. దీనిలోని సమ్మేళనాలు ఎంజైమ్ యాక్టివిటీని తగ్గిస్తాయి. అందువల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోకుండా నియంత్రణలో ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. దాల్చిన చెక్క, దాల్చిన చెక్క నుంచి తీసే నూనె తదితరాల్లో సిన్నమాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. అది కొవ్వు కణాలను కరిగించి శక్తిని విడుదల చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు.
తేనె:
పాలలో తేనెను కలిపి తాగడం వల్ల పోషకాలు మరింతగా శరీరానికి అందుతాయి. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ లాగానూ ఈ పాలు పని చేస్తాయి.