Best Web Hosting Provider In India 2024

Love Movie Review:ప్రేమిస్తే భరత్, వాణిభోజన్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ లవ్ ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆర్‌పీ బాలా దర్శకత్వం వహించాడు. లవ్ సినిమాలో భరత్ యాక్టింగ్ ఎలా ఉంది? సాడ్ ఎండింగ్ క్లైమాక్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుందా? లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
ట్రెండింగ్ వార్తలు
అజయ్ హత్య చేశాడా..?
తండ్రి వద్దని అంటోన్న వినకుండా అజయ్(భరత్)ను పెళ్లిచేసుకుంటుంది దివ్య (వాణిభోజన్). కానీ పెళ్లైన ఏడాదిలోనే ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. బిజినెస్‌లో లాస్ రావడంతో అజయ్ తాగుడుకు బానిసగా మారుతాడు. అదే టైమ్‌లో దివ్య ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది. చెకప్‌కోసం దివ్య ఒక్కతే డాక్టర్ దగ్గరకు వెళుతుంది. ఇంట్లో తాగుతూ కూర్చుంటాడు అజయ్. దివ్య ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. అతడి నిర్లక్ష్యంపై దివ్య సీరియస్ అవుతుంది. అజయ్‌లో మార్పు రాదని ఫిక్సైపోయి ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది భార్యను కన్వీన్స్ చేయడానికి అజయ్ చాలా ప్రయత్నిస్తాడు.
కానీ దివ్య మాత్రం అతడి మాట వినదు. కోపంలో దివ్యను నెట్టేస్తాడు అజయ్. తలకుబలంగా దెబ్బ తగలడంతో దివ్య చనిపోతుంది. భార్య శవాన్ని బాత్‌రూమ్‌లో దాచిపెడతాడు అజయ్. ఎవరు చూడకుండా డెడ్‌బాడీని అక్కడి నుంచి మాయం చేసేందుకు ప్లాన్స్ వేస్తుంటాడు. అదే టైమ్‌లో భార్య కారణంగా బాధలు పడుతోన్న అజయ్ స్నేహితుడు వివేక్ ప్రసన్న అతడి ఫ్లాట్‌కు వస్తాడు. అజయ్ ఫ్లాట్‌లోనే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఆఫీస్‌లోనే పనిచేసే కొలిగ్‌తో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న అజయ్ మరో స్నేహితుడు డానియల్ తన లవర్‌ను తీసుకొని అజయ్ ఫ్లాట్‌కే వస్తాడు. భార్యను మర్డర్ చేసిన విషయం స్నేహితులకు అజయ్ చెప్పాడా? దివ్య శవాన్ని వివేక్ ప్రసన్న, డానియల్‌లకు తెలియకుండా అజయ్ మాయం చేశాడా? దివ్య నిజంగానే చనిపోయిందా? అజయ్‌కి ఉన్న మానసిక సమస్య ఏమిటి? అసలు దివ్య, అజయ్లలొ చనిపోయింది ఎవరు? అన్నదే లవ్ సినిమా కథ.
ఒకే అపార్ట్‌మెంట్‌లో…
సైకలాజికల్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఆర్‌పీ బాలా లవ్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కథ మొత్తం ఒకే అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో కేవలం నాలుగు పాత్రల మధ్యే సాగుతుంది. చిన్న చిన్న అపోహలు, అపార్థాలకే భార్యాభర్తలు గొడవలు పడటం సరికాదని, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయన్నది థ్రిల్లింగ్‌గా సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.
పెళ్లి చూపుల సీన్‌తో…
భరత్, వాణిభోజన్ పెళ్లి చూపుల సీన్‌తోనే డిఫరెంట్‌గా సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత వారి పెళ్లి, ప్రేమాయణాన్ని సింగిల్ సాంగ్‌లో చూపించాడు డైరెక్టర్. ఆవేశంలో దివ్యను అజయ్ చంపడం, ఆమె శవాన్ని దాచడానికి ప్రయత్నించే సీన్స్ ఫస్ట్ హాఫ్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఆ తర్వాతే దర్శకుడు కథపై పట్టుకోల్పోయాడు. సీన్‌లోకి అజయ్ స్నేహితులు ఎంట్రీ ఇవ్వడం, వారి సమస్యలు అంటూ బోరింగ్ డ్రామా,సిల్లీ కామెడీతో కథ మొత్తాన్ని సాగదీశాడు. ఆ సీన్స్‌తో మొత్తం డైలాగ్ వెర్షన్‌తోనే సాగడంతో కథ ఎంతకు ముందు కదలక అక్కడే ఆగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.
క్రియేటివిటీకి పరాకాష్ట…
భార్యను చంపిన అజయ్…తన స్నేహితులకు మాత్రం భార్యాభర్తల రిలేషన్‌షిప్ గొప్పతనం గురించి క్లాస్ ఇవ్వడం, భార్య డెడ్‌బాడీని పక్కనే పెట్టుకొని ఆమెతో చేసిన రొమాన్స్ గురించి కలలు కనడం డైరెక్టర్ క్రియేటివిటీకి పరాకాష్టగా అనిపిస్తుంది. దివ్య చనిపోలేదు బతికే ఉందని ప్రీ క్లైమాక్స్ సీన్‌లో వచ్చే ట్విస్ట్ తోనే మళ్లీ కథ గాడినపడుతుంది. హీరోకు మానసిక సమస్య ఉన్నట్లుగా చూపిస్తూ ఊహలకు అందని మలుపుతో సినిమాను ఎండ్ చేశారు డైరెక్టర్. చివరలో వచ్చే ట్విస్ట్, టర్న్‌లు థ్రిల్లింగ్‌ను పంచుతాయి.
నెగెటివ్ ప్లస్ పాజిటివ్…
అజయ్ పాత్రలో ప్రేమిస్తే భరత్ సహజ నటనను కనబరిచాడు. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాజిటివ్ పాత్రలో ఎమోషన్స్ పడించిన తీరు ఆకట్టుకుంటుంది. దివ్యగా వాణిభోజన్ క్యారెక్టర్ లెంగ్త్ అతిథి పాత్రకు ఎక్కువ…హీరోయిన్‌కు తక్కువ అన్న చందంగా సాగుతుంది. ఉన్నంతలో ఆమె నటన ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. హీరోయిన్ స్నేహితుల్లో వివేక్ ప్రసన్న కామెడీ కొన్ని చోట్ల నవ్వించింది. డానియెల్ రోల్ కథ నిడివిని పెంచడానికే ఉపయోగపడింది.
సైకలాజికల్ థ్రిల్లర్…
లవ్ పేరు చూపి ప్రేమకథా చిత్రం అనుకుంటే పొరపడినట్లే. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. కొన్ని ట్విస్ట్‌లు, హీరోహీరోయిన్ల యాక్టింగ్ బాగున్నా డ్రామా సరిగా పండకపోవడంతో డైలీ సీరియల్‌గా బోర్ ఫీలింగ్‌ను లవ్ సినిమా కలిగిస్తుంది.