Best Web Hosting Provider In India 2024

నోటి పరిశుభ్రత పాటించాలంటే రోజూ పళ్లు తోముకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ లోదుస్తులను మార్చుకోవడం కూడా అంతే తప్పనిసరి. లోదుస్తులు మార్చుకోకపోతే అనేక ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది నిజం. వరుసగా రెండు రోజుల పాటు ఒకే రకమైన లోదుస్తులు ధరించడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకంటే.. కొందరు చలికాలంలో రెండు మూడు రోజులు స్నానం చేయకుండా అలాగే ఉంటారు. ఒకే అండర్‌వేర్ కంటిన్యూ చేస్తారు. వర్షాకాలంలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. రోజూ తలస్నానం చేయకపోయినా మంచిదే.. కానీ కచ్చితంగా లోదుస్తులను మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
గతంలో ఈ విషయంపై ఓ సర్వే జరిగింది. 2 వేల మంది అమెరికన్ల ఈ సర్వేలో పాల్గొన్నారు. దాదాపు 45 శాతం మంది రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఒకే లోదుస్తులను ధరించారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదని తేలింది. ఇది అనేక విధాలుగా మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. రోజూ లోదుస్తులు మార్చుకోకపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..
రోజంతా లోదుస్తుల నుండి డిశ్చార్జ్, తేమ కారణంగా ఇక్కడ బ్యాక్టీరియా, ఈస్ట్, ఫంగస్ వృద్ధి చెందుతాయి. అవి మలమూత్రాలతో కలుషితమవుతాయి. ఇవి పేరుకుపోవడం వల్ల లోదుస్తుల నుంచి దుర్వాసన వస్తుంది. ఇది మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేయడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
చెమట, తేమ, ధూళి, ఆయిల్ పేరుకుపోవడం వల్ల ఎర్రటి మొటిమలు ఏర్పడతాయి. అవి చాలా బాధాకరమైనవి. ఈ మొటిమలను నివారించడానికి మీ ప్రైవేట్ ప్రాంతాన్ని తాజాగా, శుభ్రంగా ఉంచండి. లేదంటే ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు బ్రీడింగ్ గ్రౌండ్ అవుతుందని గుర్తుంచుకోవాలి.
ఈస్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో సర్వసాధారణమైన ఇన్ఫెక్షన్లలో ఒకటి. ఇటువంటి అంటువ్యాధులు సాధారణంగా ఎక్కువ కాలం పాటు ఒకే మురికి లోదుస్తులను ధరించడం ద్వారా వ్యాపిస్తాయి. ఇది చికాకు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
జననేంద్రియ ప్రాంతం దగ్గర దద్దుర్లు సమస్యాత్మకంగా ఉంటాయి. ఒకే అండర్ వేర్ ధరిస్తూ ఉంటే.. ఈ సమస్య అలానే కంటిన్యూ అవుతుంది. రోజూ లోదుస్తులను మార్చుకోకపోవడం వల్ల మీ చర్మం ఎర్రగా మారుతుంది. చికాకు ఉంటుంది. తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా జననేంద్రియ ప్రాంతం సున్నితంగా మారుతుంది. ఇది దద్దుర్లకు దారితీస్తుంది. రోజూ లోదుస్తులను మార్చుకోండి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. జిమ్‌కి వెళ్లేటప్పుడు చెమట ఎక్కువగా పడితే కచ్చితంగా లోదుస్తులను మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో లోదుస్తులను రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మార్చాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. లోదుస్తులే కదా అని లైట్ తీసుకోవద్దు. సమస్యలు తెచ్చుకోవద్దు.