Best Web Hosting Provider In India 2024

Devara Glimpse: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాపై అంచనాలు ఆకాశమంత ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ అయ్యారు ఎన్టీఆర్. ఆ మూవీ తర్వాత దేవర చేస్తుండటంతో క్రేజ్ విపరీతంగా ఉంది. కొరటాల శివ ఈ భారీ బడ్జెట్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. దేవర పార్ట్-1 సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. కాగా, దేవర మూవీ అప్‍డేట్ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర సినిమా గ్లింప్స్ గురించి బజ్ బయటికి వచ్చింది. గ్లింప్స్ ఎప్పుడు రానుందో సమాచారం చక్కర్లు కొడుతోంది.
ట్రెండింగ్ వార్తలు
దేవర సినిమా గ్లింప్స్ పనులను మూవీ యూనిట్ ఇప్పటికే చేస్తోందని తెలుస్తోంది. దేవర గ్లింప్స్ వీడియో 2024 జనవరి 8వ తేదీన రిలీజ్ కానుందని రూమర్స్ బయటికి వచ్చాయి. ఈ విషయంపై మూవీ యూనిట్ నుంచి త్వరలోనే ప్రకటన రానుందని బజ్ నడుస్తోంది.
దేవర సినిమాను అత్యున్నత ప్రామాణాలతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ కూడా ఇటీవలే డేవిల్ మూవీ ఈవెంట్‍లో ఈ విషయాన్ని చెప్పారు. అందరినీ సంతృప్తి పరిచేలా ఉండేందుకు పని చేస్తున్నామని, దేవర గ్లింప్స్ త్వరలోనే వస్తుందని ఆయన చెప్పారు.
సముద్ర తీర ప్రాంతంలో ఉండే ప్రజల కోసం పోరాడే యోధుడిగా దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఎక్కువ భాగం సముద్రంపై, సముద్ర తీరంలో జరగనుంది. అలాగే, అండర్ వాటర్ యాక్షన్ సీన్లు ఈ మూవీలో హైలైట్‍గా నిలుస్తాయని తెలుస్తోంది.
దేవర చిత్రంలో హీరో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో పోషిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. షైన్ టామ్ చాకో, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, కలైయరాసన్, మురళీ శర్మ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
దేవర చిత్రానికి డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్‍టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుతోంది. జనవరి ముగిసేలోగా దేవర పార్ట్-1 షూటింగ్ పూర్తవుతుందని అంచనా.
దేవరను రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్టు దర్శకుడు కొరటాల శివ చెప్పారు. దేవర పార్ట్-1.. 2024 ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం