Best Web Hosting Provider In India 2024

AP Congress : లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తుంది. రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకుంటే…దిల్లీ పీఠానికి దగ్గరయ్యే అవకాశం ఉండడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఒక్క ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఉంది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడగా, కేరళ, తమిళనాడులో ఇండియా కూటమి పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచేందుకే కష్టపడుతోంది. రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో కాంగ్రెస్ హవా నడిచింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ క్యాడర్ వైసీపీకి షిఫ్ట్ అయ్యింది. మళ్లీ పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం…తిరిగి ఏపీపై దృష్టిపెట్టింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకునేందుకు వ్యూహరచన చేస్తుంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా మాణిక్యం ఠాకూర్ కు బాధ్యతలు అప్పగించింది.
ట్రెండింగ్ వార్తలు
ఏపీపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీ వ్యవహారాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ నేతలు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. డిసెంబర్ 27న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఓ సమావేశం జరుగనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిక కాంగ్రెస్ అధిష్ఠానం…ఆ మేరకు వ్యూహాలు సిద్ధం చేస్తుంది. కర్ణాటకలో ఐదు, తెలంగాణలో ఆరు హామీలతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్… ఏపీలో ఎన్ని హామీలు ఇస్తుందనే విషయంపై చర్చ జరుగుతోంది. ఏపీ స్పెషల్ స్టేటస్ ప్రధాన అజెండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం ఉండబోతుందని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వస్థితి తెచ్చేందుకు రాహుల్ , ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటిస్తారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రుద్రరాజు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.
ఏపీ బాధ్యతలు షర్మిలకు!
తెలంగాణ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ విలీనం ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ విలీనంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఏపీ పీసీసీ బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీకి షిఫ్ట్ అయిన కాంగ్రెస్ క్యాడర్ తిరిగి పార్టీకి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందని తెలుస్తోంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించే ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఏపీ పీసీసీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తే… వైసీపీలోని అసంతృప్తి నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సీఎం జగన్ పాలనపై వ్యతిరేకత ఉందని, ఇటీవల ఇన్ ఛార్జ్ మార్పుతో కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని కాంగ్రెస్ అంటున్నారు.