Best Web Hosting Provider In India 2024

Rasam Powder Recipe: దక్షిణాది రాష్ట్రాల్లో రసం పొడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎన్ని కూరలు ఉన్నా చివరలో చారుతో రెండు ముద్దలు తినేవారు ఎక్కువే. అలాంటి చారు పొడిని కొనేకన్నా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసుకుంటే ఆరు నెలల పాటు తాజాగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నిల్వ చేసుకుంటే చాలు. దీన్ని తయారు చేయడం చాలా సులువు. ఇంట్లోనే చేసుకుంటారు కాబట్టి లేనిపోని రసాయనాలు కలవకుండా జాగ్రత్త పడొచ్చు. బయటకొనే చారు పొడిలో కొన్ని రకాల కెమికల్స్ కలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా నిల్వ కోసం ప్రిజర్వేటివ్స్‌ని వేసి తయారుచేస్తారు. అలాంటివి లేకుండా ఇంట్లోనే సేంద్రియ పద్ధతిలో దీన్ని తయారు చేసుకోండి. చారు పొడి రెసిపీ ఎలాగో చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
రసం పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు
ఎండుమిర్చి – 15
మిరియాలు – పావు కప్పు
కందిపప్పు – పావు కప్పు
జీలకర్ర- పావు కప్పు
ధనియాలు – ఒక కప్పు
కరివేపాకులు – ఐదు రెబ్బలు
రసం రెసిపీ తయారీ ఇలా
1. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు వేసి వేయించాలి.
2. వీటిని చిన్న మంట మీద వేయిస్తే బాగా వేగుతాయి.
3. తర్వాత జీలకర్ర, కందిపప్పు, మిరియాలు, ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి.
4. చివరిలో కరివేపాకులను వేసి వేయించాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేయాలి.
5. ఒక టేబుల్ స్పూన్ పసుపు, అర స్పూన్ ఇంగువ కూడా వేసి అన్ని మెత్తగా పొడిలా చేసుకోవాలి.
6. దీన్ని గాలి చొరబడని ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్లో పెట్టుకోవాలి.
7. ఆరు నెలల వరకు ఇది తాజాగా ఉంటుంది. దీంతో చారు చేసుకుంటే చాలా తాజాగా, చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ చారు పొడిలో ముఖ్యమైన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, కందిపప్పు. ఈ మూడింటి వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ధనియాలలో ఉండే ఔషధ గుణాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో ధనియాలు ముందుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీనిలో యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలు ఎక్కువ. కాబట్టి మధుమేహ రోగులు కచ్చితంగా ధనియాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చారు పొడిలో ఈ ధనియాలు ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి దీంతో ప్రతిరోజు రసం చేసుకుంటే మంచిది. జీలకర్రను కూడా ఇందులో వినియోగించాం, దానివల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. బీపీ, షుగర్ అదుపులో ఉంచుతుంది. కొన్ని రకాల చర్మ సమస్యలు, అలెర్జీలను రాకుండా అడ్డుకుంటుంది. కందిపప్పు తినడం వల్ల ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. ఈ పప్పుతో ఫైబర్, క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. జ్ఞాపకశక్తిని పెంచేందుకు కూడా ఇది ఔషధంలా పనిచేస్తుంది.