Best Web Hosting Provider In India 2024
CM Revanth Reddy : నాలుగు నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చెక్ ను శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని సీఎం గుర్తు చేశారు. ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేవలం వారం రోజుల్లో అధికారులు ఆ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. శనివారం బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి సీఎం చేతుల మీదుగా ఆ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
ట్రెండింగ్ వార్తలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు, మాజీ డీఎస్పీ నళిని
సీఎం రేవంత్ రెడ్డిని వారి నివాసంలో ప్రముఖ నటుడు నాగార్జున, అమల దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్
ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. మరోసారి తన హోదా, అధికారం కన్నా మానవత్వమే మిన్న అని నిరూపించారు సీఎం. శనివారం సీఎం తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే క్రమంలో కేబీఆర్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఓ అంబులెన్స్ అటుగా రావడం కనిపించింది. ఇది గమనించిన సీఎం అంబులెన్స్ కు దారివ్వాలని సూచించారు. దీంతో సీఎం కాన్వాయ్ అంబులెన్స్ కు దారిచ్చింది. అటుగా వెళుతున్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలోనూ తన కోసం ట్రాఫిక్ ను ఆపొద్దంటూ సీఎం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది.