Best Web Hosting Provider In India 2024
Vangaveeti Radha: విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. గత కొద్ది రోజులుగా విజయవాడలో వంగవీటి రాధా రీ ఎంట్రీ ప్రచారం జోరుగా సాగుతోంది. అంతకు ముందు రాధా సోదరి ఆశను విజయవాడ నుంచి పోటీలోకి దింపేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా రాధా సైతం వైసీపీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మధ్యవర్తిత్వం వహించినట్టు చెబుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
కోస్తా జిల్లాల్లోని కాపుల్లో తిరుగులేని పట్టు ఉన్న వంగవీటి రంగా కుమారుడిని వైసీపీ గూటికి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.కమ్మ-కాపు సామాజిక వర్గాలతో కలిసి టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న వేళ వంగవీటి కుటుంబానికి చెందిన రాధాను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ కొద్ది నెలలుగా ప్రయత్నిస్తోంది.
2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు వైసీపీ యువజన విభాగం బాధ్యతలను వంగవీటి రాధా నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కొద్ది కాలానికే వైసీపీలోకి వచ్చిన రాధా కీలక బాధ్యతలు అప్పగించారు. 2014 ఎన్నికల్లో రాధా ఓటమి పాలైన తర్వాత 2019లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పట్లో మచిలీపట్నం ఎంపీ స్థానం లేదా అవనిగడ్డ నుంచి వంగవీటి రాధాను పోటీ చేయించాలని వైసీపీ భావించింది.
2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు విజయవాడ సెంట్రల్ నియోజక వర్గానికి చెందిన పూనూరు గౌతమ్ రెడ్డితో రాధా కుటుంబానికి వివాదం తలెత్తింది. వంగవీటి రంగాపై గౌతమ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గౌతమ్‌రెడ్డిపై వైసీపీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
ఓ పోలీస్ ఉన్నతాధికారితో పాటు మీడియా సంస్థ యజమాని ప్రోద్భలంతో రాధా వైసీపీని వీడిపోయారు. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత ఆయన రెండు మూడు సందర్భాల్లో మాత్రమే రాజకీయ వేదికలపై కనిపించారు. కొద్ది నెలల క్రితం వంగవీటి రాధా వివాహం పశ్చిమగోదావరికి చెందిన యువతితో జరిగింది.
ఒక్కసారే గెలుపు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని గుర్తింపు ఉన్న రాజకీయ కుటుంబానికి వారసుడైనా వంగవీటి రాధా చేతులారా రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకున్నారనే అపవాదు ఉంది. 2004లో 25ఏళ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యే అయిన రాధా 2009లో వైఎస్ వారిస్తున్నా వినకుండా ప్రజారాజ్యంలో చేరి ఓటమి పాలయ్యారు. కేవలం 848 ఓట్ల తేడాతో మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు.
2009 ఎన్నికలకు కొద్ది నెలల ముందు విజయవాడ రాఘవయ్య పార్కు వద్ద రంగా విగ్రహానికి పూలమాలలు వేయడానికి వచ్చిన మల్లాది విష్ణుపై రాధా అనుచరులు దాడి చేయడం ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. దీంతో విష్ణుకు సానుభూతి ఓట్లు పెరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాధా పార్టీ మారకుండా ఉంటే అదే నియోజక వర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారు.
2014లో విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం కాదనుకుని తూర్పు నుంచి పోటీ చేవారు. 15వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. 2014 ఎన్నికల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
తొలి గెలుపు తర్వాత 20ఏళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో వంగవీటి రాధా విజయం సాధించలేదు. దుందుడుకు స్వభావం, క్రియాశీలకంగా లేకపోవడం, కీలక బాధ్యతలు అప్పగించినా వాటిని అందిపుచ్చుకోక పోవడం, తండ్రి వారసత్వం మీదే ఇప్పటికీ రాజకీయాలు చేస్తుండటం రాధాకు లోపాలుగా మారాయి.
2019 ఎన్నికలకు ముందు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నప్పుడు బొత్స సత్యనారాయణ, సాయిరెడ్డి వంటి వారితో బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. వదిలేస్తే కొట్టుకుపోతాడని జగన్ హెచ్చరించడం తనకు నచ్చలేదంటూ ప్రకటించి వైసీపీ నుంచి రాధా టీడీపీలోకి వెళ్లిపోయారు. వైసీపీని వీడటానికి సహేతుకమైన కారణాలు ఏమి లేకపోయినా కొందరి ప్రభావంతోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడని సన్నిహితులు చెబుతారు.
2004లో కాంగ్రెస్‌లో, 2009లో పిఆర్పీలో, 2014లో వైసీపీలో, 2019లో టీడీపీలో కొనసాగిన రాధా ఇప్పుడు అన్నీ కలిసొస్తే తిరిగి వైసీపీ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి. వైసీపీలో రాధా చేరితే దాని ప్రభావం బాగా ఉంటుందని ఐ పాక్ అంచనా వేస్తోంది. జనసేన-టీడీపీ కూటమిపై విమర్శలు ఎక్కు పెట్టడానికి వీలవుతుందని భావిస్తున్నారు.