Best Web Hosting Provider In India 2024
Jagananna Arogya Suraksha: ఏపీలో రెండో దశ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జనవరి రెండు నుంచి ప్రారంభిస్తున్నారు. రెండో దశ లో 6 నెలల పాటు నిరంతర ప్రాతిపదికన మొత్తం 13,954 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుండి ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించారు.
50 రోజుల పాటు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష – 1 కార్యక్రమం విజయ వంతంగా అమలు కావడం, తద్వారా 60 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందడంతో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ రెండో దశకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జనవరి 2వ తేదీ నుండి, పట్టణ ప్రాంతాల్లో జనవరి 3 వ తేదీ నుండి జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ప్రారంభమవుతాయన్నారు. ఆరు నెలల పాటు నిరంతర ప్రాతిపదికన నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష – 2 కార్యక్రమం మరింత విజయవంతం చేస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపుల నిర్వహణ
జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, పట్టణాలు, స్థానిక సంస్థలలో ఏప్రియల్ 30 వరకు నిరంతర ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో 10,032 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 3,922 శిబిరాలతో కలిపి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ లో మొత్తం 13,954 ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నామని వెల్లడించారు.
ఒక్క జనవరి నెలలోనే మొత్తం 3,583 శిబిరాలు నిర్వహించనున్నామన్నారు. ఆరోగ్య శిబిరాల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించేందుకు జనరల్ మెడిసిన్-543, గైనకాలజిస్ట్‌లు- 645, జనరల్ సర్జన్లు-349, పిడియాట్రిషియన్లు- 285, ఆర్ధోపెడిషియన్లు- 345 మరియు ఇతర నిపుణులు- 378 విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.
అంతేగాక 2,545 మంది స్పెషలిస్టు వైద్యులు, 2731 ఎంబీబీఎస్ వైద్యులు ఈ ఆరోగ్య శిబిరాల్లో పాల్గొంటారని తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించడానికి మొత్తం 562 మంది పీఎంఓఏలు ఆరోగ్య శిబిరాల కోసం నియమించనున్నామన్నారు.
ఇంటింటికి ప్రచారం…
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇళ్లను సందర్శించడమే కాకుండా దీర్ఘకాలిక రోగులు, గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులు, చిన్నారుల సంరక్షణ, యుక్తవయస్కుల ఆరోగ్యం మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తుల ఆరోగ్యమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష -2 కార్యక్రమం కొనసాగనుందని అధికారులు వివరించారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి రెండుసార్లు వెళ్లి ఆరోగ్య శిబిరాల వివరాలను ప్రజలకు వివరించనున్నారని పేర్కొన్నారు.
విలేజ్ హెల్త్ క్లినిక్ లు, పట్టణాల్లోని సచివాలయాల వద్దే జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ శిబిరాలు నిర్వహించబడుతాయన్నారు. జిల్లాలో మొత్తం మండలాలను సమానంగా విభజిస్తారని, జిల్లాలోని సగం మండలాల్లో ప్రతి మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో ప్రతి శుక్రవారం ఒక శిబిరం నిర్వహిస్తారని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో బుధవారం శిబిరాలు నిర్వహించనున్నారు. తద్వారా 6 నెలల వ్యవధిలో అన్ని పట్టణ సచివాలయాల్లో శిబిరాలు నిర్వహించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ప్రతి ఆరోగ్య శిబిరంలో కనీసం ముగ్గురు వైద్యులు ఉంటారని వారిలో ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు మరియు ఒకరు పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ (PMOA) ఉంటారని పేర్కొన్నారు.
ఉచితంగా మందుల పంపిణీ…
జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో వైద్యుల సలహా మేరకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా గ్రామీణ ప్రాంతాల్లో 92 రకాల మందులు, పట్టణ ప్రాంతాల్లో 152 రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర మందుల కిట్‌లో 14 రకాల మందులు సిద్ధంగా ఉంచామన్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి దశలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీహెచ్‌ఓలు/ఏఎన్‌ఎంలు 1,45,35,705 ఇళ్లను సందర్శించి, వారి ఇళ్లలోనే 6,45,06,018 పరీక్షలు నిర్వహించారని తెలిపారు. 12,423 జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా 60,27,843 ఓపీలు నమోదు చేశామని పేర్కొన్నారు. 1,64,982 మంది రోగులను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఉచితంగా చికిత్స కోసం పంపించామని వెల్లడించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో వైద్యులు సూచించిన రోగులకు నాణ్యమైన వైద్యం, చికిత్స అందించేలా సీహెచ్‌ఓ/ఏఎన్‌ఎం లు నెట్‌వర్క్ ఆసుపత్రిలోని ఆరోగ్యమిత్రలకు తెలిపి సాయం అందిస్తారన్నారు. రోగులకు రవాణా,ఇతర ఖర్చుల కోసం రూ. 500 అందించనున్నామన్నారు. ఈ మొత్తం ప్రక్రియను యాప్ ద్వారా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.