Best Web Hosting Provider In India 2024
TS Graduate MLC Election: ‘‘ నల్లగొండ – వరంగల్ – ఖమ్మం ’’ శాసన మండలి గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యుని గా 2021లో ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ట్రెండింగ్ వార్తలు
దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉంది. శాసన సభలో అతి తక్కువ మంది సభ్యులు ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ ఈ సారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు వ్యూహాలు రిచిస్తోంది.
ఇదీ.. శాసన మండలి చిత్రం
తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికయ్యే సభ్యులు 14 మంది, స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకునే సభ్యులు 14 మంది, గవర్నర్ నామినేట్ చేసే వారు 6 మంది కాగా, ఉపాధ్యాయులు ఎన్నుకునే ఎమ్మెల్సీల సంఖ్య3, పట్టభద్రులు ఎన్నుకునే ఎమ్మెల్సీల సంఖ్య 3గా ఉంది.
మొత్తం 40 మంది సభ్యులు గల తెలంగాణ శాసన మండలిలో ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కేవలం ఒక్కరే ఎమ్మెల్సీగా ఉన్నారు. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఇన్నాళ్లూ ఈ ఒక్క సీటుతోనే కాంగ్రెస్ సంతృప్తి చెందుతోంది. శాసన మండలిలో బీఆర్ఎస్ కు 24, కాంగ్రెస్ కు 1, బీజేపీకి 1, టీచర్స్ నుంచి 1, ఇండిపెండెంట్ (టీచర్) 1, ఎంఐఎం 2, గవర్నర్ నామినేటెడ్ నుంచి 4 సభ్యుల చొప్పున ఉన్నారు. కాగా, మరో 6 ఖాళీలు ఉన్నాయి.
ఇందులో గవర్నర్ నామినేట్ చేయాల్సిన స్థానాలే రెండు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక ఎమ్మెల్సీ పదవికి రాజీనామాచేశారు. షెడ్యూలు ప్రకారం ఒక్కో ఖాళీ స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉంది.
నల్గొండ నియోజకవర్గంపై పార్టీల నజర్
నల్గొండ – వరంగల్ – ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరగునున్న ఎన్నికపై అన్ని పార్టీలూ దృష్టి పెట్టాయి. 2021 మార్చిలో ఈ స్థానానికి ఎన్నిక జరగగా పదవీ కాలం 2027 మార్చిలో ముగియాలి. కానీ ముందుగానే ఎమ్మెల్సీ పదవి ఖాళీ కావడంతో ఎన్నిక అనివార్యమవుతోంది.
మరో మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉండడంతో సహజంగానే పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నారు. మరో వైపు మూడు జిల్లాలతో పరిచయాలు, సంబంధాలు కలిగి ఉన్న నేతలకు, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులకు ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్రలుగా ప్రొఫెసర్ కోదండరాం, చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న పోటీ చేశారు. ఈ ఎన్నికలలో మల్లన్న రెండో స్థానంలో నిలిచారు.
శాసన మండలిలో సభ్యుల సంఖ్యను పెంచుకునే యోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం నల్గొండ – వరంగల్ – ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎవరిని పోటీకి దింపుంతుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ఎవరిని ప్రయోగిస్తుందన్న అంశమూ ఆసక్తి రేపుతోంది.
బీజేపీ నుంచి ఈ సారి కూడా తనకు అవకాశం ఇవ్వాలని గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రేమేందర్ రెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రకాశ్ రెడ్డి కోరుతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
(రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )