Best Web Hosting Provider In India 2024
Janagama Suicide: కాబోయే భర్త అనుమానించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. దీంతో యువతి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో కొత్త ఏడాది ప్రారంభంలోనే ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
ట్రెండింగ్ వార్తలు
పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఇప్పగూడెం గ్రామానికి చెందిన లింగనబోయిన సుజాత–సోమయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లున్నారు. వారి పెద్ద కూతురు లింగనబోయిన వసంత(19) స్టేషన్ ఘన్ పూర్ లోమోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ఇద్దరు కూతుళ్లు కావడంతో ఒకరి తరువాత ఒకరికి పెళ్లి చేసేందుకు తండ్రి సోమయ్య నిర్ణయించుకున్నారు. చదువుల్లో చురుగ్గా ఉండే వసంతకు పెళ్లి సంబంధాలు చూశాడు. రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామానికి చెందిన నర్సింగుల హరీశ్ అనే యువకుడితో పెళ్లి సంబంధం కుదిర్చారు.
ఇరువర్గాలు అంగీకరించడంతో కట్నకానుకలు మాట్లాడుకుని డిసెంబర్ 22న నిశ్చాతార్థం కూడా చేసుకున్నారు. నిశ్చితార్థ సమయంలో కట్నకానుల కింద సోమయ్య రూ.20 వేలను పెద్ద మనుషులు, బంధువుల సమక్షంలో హరీశ్ కు అప్పజెప్పారు.
ప్రాణం తీసిన అనుమానం
నిశ్చితార్థం పూర్తవడంతో హరీశ్, వసంత ఇద్దరూ ఫోన్ నెంబర్లు షేర్ చేసుకుని రోజూ మాట్లాడుకుంటున్నారు. అంతా సాఫీగానే సాగుతున్న క్రమంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి 2 గంటలకు వసంత కోసం హరీశ్ తన స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్లాడు.
అందరూ పడుకుని ఉండటంతో వసంత తండ్రి సోమయ్యను నిద్రలేపాడు. వసంతతో మాట్లాడాల్సి ఉందని, తనను పిలవాల్సిందిగా చెప్పడంతో నిశ్చితార్థం కూడా అయ్యిందిలే అన్న ధీమాతో సోమయ్య వసంతను పిలిచాడు. దీంతో వసంత బయటకు రాగా హరీశ్ కొంతసేపు ఆమెతో మాట్లాడాడు.
అనంతరం వసంత తండ్రి వద్దకు వచ్చిన హరీశ్ ‘మీ కూతురు రోజూ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతోంది. నేను ఆమెను పెళ్లి చేసుకోను’ అని చెప్పాడు. ముందస్తుగా కట్నం కింద ఇచ్చిన 20 వేలకు మరో 20 వేలు అదనంగా చెల్లిస్తానని చెప్పాడు. దీంతో సోమయ్య కంగారు పడిపోయాడు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఇలా మాట్లాడితే ఎలాగని, తెల్లావారిన తరువాత ఇంట్లో అందరి సమక్షంలో మాట్లాడుకుందామని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.
అయినా హరీశ్ వినకుండా రాద్ధాతం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పెళ్లికి ముందే అనుమానంతో హరీశ్ మానసికంగా ఇబ్బందిపెట్టడం, తండ్రి ఇబ్బందులు గమనించిన వసంత తీవ్ర మనస్తాపానికి గురైంది.
సోమవారం కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో వసంత కుటుంబ సభ్యులు ఎవరి పనుల్లో వారున్నారు. అప్పటికే హరీశ్ తీరుతో తీవ్ర వేదనకు గురైన వసంత.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఆ తరువాత చాలాసేపటికి వసంత చెల్లి కావ్య ఇంటికి రాగా.. వసంత డెడ్ బాడీ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.
దీంతో భయపడిపోయిన కావ్య ఒక్కసారిగా కేకలు వేస్తూ బోరున విలపించింది. కుటుంబసభ్యులు, చుట్టుపక్కల ఉన్నవాళ్లు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
స్థానికులు, వసంత తండ్రి సోమయ్యతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆ తరువాత మృతదేహాన్ని కిందికి దించి, పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా తండ్రి సోమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.
(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)