Best Web Hosting Provider In India 2024
YS Sharmila Entry: ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల కలకలం కొనసాగుతోంది. ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల ఎంట్రీ ఖాయమని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరడానికి సిద్ధమైనా రేవంత్ రెడ్డి అభ్యంతరాలతో ఆమె చేరిక ఆలస్యమైంది. తెలంగాణ ఎన్నికలపై షర్మిల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రేవంత్ కన్విన్స్ చేయగలిగారు. దీంతో షర్మిలను కొద్ది రోజుల పాటు వేచి ఉండటానికి కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ఒప్పించింది.
ట్రెండింగ్ వార్తలు
కాంగ్రెస్ పార్టీ ఏమి హామీ ఇచ్చిందో నిర్దిష్టంగా తెలియకపోయినా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించడంలో భాగంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయడం ఇష్టం లేక ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. షర్మిలతో పాటు రెండున్నరేళ్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీలో కొనసాగిన వారిని ఆమె నిర్ణయం నొప్పించినా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో షర్మిల భవితవ్యం మరోసారి తెరపైకి వచ్చింది. గత వారం ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై జరిగిన సమావేశంలో ఏపీ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలోనే షర్మిలను పార్టీలోకి తీసుకోవడంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ కాంగ్రెస్ నాయకుల నుంచి సానుకూల స్పందన రావడంతో షర్మిల రాక లాంఛనం కానుంది.
స్వాగతిస్తున్న ఏపీ కాంగ్రెస్…
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఇప్పటికే ప్రకటించారు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అందులో రుద్రరాజు మాట్లాడుతూ వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తమ పార్టీ అధినాయకులు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తనతో చెప్పారని స్పష్టం చేశారు.
వైసీపీ శిబిరంలో కలకలం…
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలతో వైసీపీ శిబిరంలో కలకలం రేగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల వస్తే దాని ప్రభావం ఖచ్చితంగా ఆ పార్టీపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఏపీలో వైసీపీకి అండగా ఉంటున్న సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలుగా ఉండేవి. 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఈ వర్గాలు ప్రధానంగా పనిచేశాయి. 2009లో వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, జగన్ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత కాంగ్రెస్‌కు అండగా నిలిచిన సామాజిక వర్గాలు జగన్ వెంట నడిచాయి.
2014లో గెలిచిన స్థానాలతో పాటు, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం వెనుక ఎస్సీ, ఎస్టీలు కీలక పాత్ర పోషించారు. మైనార్టీలు కూడా గణనీయమైన పాత్రను పోషించారు. 2019 తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ వర్గాలకు తగినంత రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయిందనే భావన ఉంది. దీంతో పాటు జగన్ పూర్తిగా బీజేపీ అదుపాజ్ఞల్లో ఉండటం, బీజేపీతో అధికారికంగా పొత్తు లేకపోయినా, ఆ పార్టీకి నమ్మకమైన భాగస్వామిగా ఉండటం అయా వర్గాల్లో అంతర్లీనంగా అసంతృప్తికి కారణమైంది. ఏపీలో మరో ప్రధాన పక్షమైన టీడీపీ కూడా బీజేపీ ప్రాపకం పాకులాడుతుండటంతో అయా వర్గాలకు రాజకీయ ప్రత్యామ్నయం లేకుండా పోయింది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున పరిస్థితుల్లో గట్టి చోదక శక్తి అవసరం. షర్మిల ఏపీ కాంగ్రెస్‌లోకి వస్తే ఖచ్చితంగా గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయక ఓటు బ్యాంకులను సొంత గూటికి నడిపించడానికి ఆమె ఇమేజ్ ఉపయోగ పడుతుంది. కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజానీకం ఎంతమేరకు క్షమించి ఆదరిస్తారనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల కంటే మెరుగ్గా కాంగ్రెస్ భవితవ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
షర్మిలతో పాటు అసంతృప్త నేతలు…
షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మరికొంతమంది అసంతృప్త నేతలు కూడా ఆమె నడుస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. షర్మిలతో ప్రయాణిస్తానని ప్రకటించారు. ఆమెతో పాటు మరికొందరు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కాంగ్రెస్‌లో భారీగా చేరతారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు చెప్పారు. వైకాపా ప్రభుత్వంతో విసిగిపోయిన బడుగు, బలహీనవర్గాలు, మైనారిటీలు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారని చెప్పారు.
షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా బృందాలు ఆమెను టార్గెట్ చేశాయి. తెలంగాణలో షర్మిల పార్టీ ఏమైందంటూ ట్రోల్ చేయడం ప్రారంభించాయి. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేసే వ్యక్తులు సైతం షర్మిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలన్ని ఆమెకు మంచి చేస్తాయని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
మరోవైపు మంగళవారం మధ్యాహ్నం షర్మిల ఇడుపులపాయ వెళ్లనున్నారు. కుమారుడి పెళ్లికార్డును తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు నిర్వహించనున్నారు. ప్రియా అట్లూరి కుటుంబంతో కలిసి ఇడుపులపాయ వెళుతున్నట్టు షర్మిల ట్విట్టర్‌లో ప్రకటించారు. షర్మిల రాజకీయ భవితవ్యంపై త్వరలోనే స్పష్టత వస్తుందని చెబుతున్నారు. కుమారుడి వివాహం లోపు పార్టీలో చేరుతారా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.