ఏపీ విద్యుత్‌ సంస్థలకు ప్రతిష్టాత్మక అవార్డులు 

Best Web Hosting Provider In India 2024

 

మూడు ‘ఫాల్కన్‌ మీడియా–ఎనర్షియా ఫౌండేషన్‌’ జాతీయ అవార్డులు కైవసం

ఏపీ ట్రాన్స్‌కోకు ‘టాప్‌ స్టేట్‌ యుటిలిటీ ఫర్‌ ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ అవార్డు

ఉత్తమ రాష్ట్ర టాప్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ నోడల్‌ ఏజెన్సీ అవార్డు పొందిన నెడ్‌క్యాప్‌

రెన్యూవబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్స్‌ను చేరుకున్న ఉత్తమ రాష్ట్రంగా ఏపీ

ఇంధన శాఖ అధికారులకు సీఎం జగన్‌ అభినందనలు

 తాడేప‌ల్లి: రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన విద్యుత్‌ సంస్థలకు అందించే ‘ఫాల్కన్‌ మీడియా–­ఎనర్షియా ఫౌండేషన్‌’ జాతీయ అవార్డులను ఏకంగా మూడింటిని ఏపీ విద్యుత్‌ సంస్థలు పొందాయి. ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఏపీ ట్రాన్స్‌కో)కు ‘టాప్‌ స్టేట్‌ యుటిలిటీ ఫర్‌ ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ అవార్డు లభించింది.
పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్రాజెక్ట్‌ల ప్రచారానికి సంబంధించి దేశంలోనే బెస్ట్‌ స్టేట్‌ టాప్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ నోడల్‌ ఏజెన్సీగా న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) అవార్డును కైవసం చేసుకుంది. రెన్యూవబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్స్‌ (పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలు బాధ్యత) లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ ముందంజలో ఉన్న ఉత్తమ రాష్ట్రంగా ఏపీ విద్యుత్‌ సంస్థలను అవార్డు వరించింది.

డిసెంబర్‌ 29వ తేదీన ముంబైలో జరిగిన ‘16వ ఎనర్షియా అవార్డ్స్‌–2023’ ప్రదానోత్సవంలో ఏపీ విద్యుత్‌ సంస్థలకు ఈ అవార్డులను అందించారు. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె.విజయానంద్‌ సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డిని కలిసి రాష్ట్రానికి లభించిన అవార్డుల గురించి వివరించారు. ప్రతిష్టాత్మకమైన అవార్డును గెలుచుకోవడంలో కృషి చేసిన విద్యుత్‌ సంస్థలు, ఇంధన శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా అభినందించారు.

దేశంలోనే అత్యుత్తమ విద్యుత్‌ వ్యవస్థ
ఏపీ ట్రాన్స్‌కో సాధించిన విజయాలను ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. ట్రాన్స్‌మిషన్‌ సిస్టం లభ్యత 99.7 శాతం (హై రెగ్యులేటరీ బెంచ్‌ మార్క్‌ 99.5 శాతం) ఉందని, ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు 2.74 శాతానికి పరిమితమ­య్యాయని తెలిపారు. దేశంలోనే అత్యంత విశ్వస­నీయ స్టేట్‌ ట్రాన్స్‌కో, గ్రిడ్‌ ఆపరేటర్‌గా కూడా ఏపీ ట్రాన్స్‌కో గుర్తింపు పొందిందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడానికి, పునరుత్పాదక శక్తిని పెద్ద మొత్తంలో సాధించడానికి వీలు కల్పిస్తుందని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ–2020, ఏపీ పంప్డ్‌ స్టోరేజీ ప్రమోషన్‌ పాలసీ–2022, ఏపీ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ గ్రీన్‌ అమ్మోనియా ప్రమోషన్‌ పాలసీ–2023 వంటి ప్రమోషన్‌ పాలసీలను ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ నిర్వహణలో నోటిఫై చేసిందని చెప్పారు. పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందన్నారు.

37 ప్రాజె­క్టులకు టెక్నో–కమర్షియల్‌ ఫీజిబిలిటీ రిపోర్ట్స్‌ (టీసీఎఫ్‌ఆర్‌) తయారయ్యాయని, వేరియబుల్‌ రెన్యూ­వబుల్‌ ఎనర్జీ జనరేషన్‌ని బ్యాలెన్స్‌ చేయ­డానికి, గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ సరఫరాను అందించడానికి ఇవి ఉపయోగపడతా­యని వివరించారు. మొత్తం 41,020 మెగావాట్ల సామర్థ్యంతో దశలవారీగా పీఎస్పీ ప్రాజెక్టుల స్థాపనకు నివేదికలు సిద్ధమవుతున్నాయని తెలి­పారు.

భవిష్యత్తులో కూడా ఏపీ పవర్‌ సెక్టార్‌ను దేశంలోనే నంబర్‌–1గా నిలిపేందుకు నిరంతరం కృషిచేయాలని విద్యుత్‌ సంస్థలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.  సీఎంను కలిసిన వారిలో ఏపీ జెన్‌కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీన్‌ చక్రధర్‌బాబు, నెడ్‌క్యాప్‌ వీసీ అండ్‌ ఎండీ ఎస్‌.రమణారెడ్డి, ట్రాన్స్‌కో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ జేఎండీ బి.మల్లారెడ్డి, ఇంధన శాఖ జాయింట్‌ సెక్రటరీ, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో కుమారరెడ్డి, గ్రిడ్‌ డైరెక్టర్‌ ఏకేవీ భాస్కర్‌ ఉన్నారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *