BJP KishanReddy: కాళేశ‌్వరం అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్న కిషన్‌రెడ్డి

Best Web Hosting Provider In India 2024

BJP KishanReddy: కాళేశ్వర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజాధనాన్ని గోదాట్లో కలిపారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదరకపోతే కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఆదేశించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అవినీతి పట్ల అనేకసార్లు ప్రస్తావించిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు, ప్రాజెక్టుల్లో స్కాంలపై దర్యాప్తు చేపడుతామని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు.. ఇంజనీరింగ్ మార్వెల్.. కేసీఆర్ అపరభగీరథుడని బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పారని, ప్రాజెక్టు నిర్మాణంలో 7 బుర్జ్ ఖలీఫాలకు సమానమైన కాంక్రీట్ ను వాడడం.. 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడే ఉక్కును ఉపయోగించినట్లు ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

డిస్కవరీ చానళ్లలో కేసీఆర్ చీఫ్ ఇంజినీర్ గా పొగడ్తలతో డాక్యుమెంటరీల ప్రదర్శించారని , 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. చీఫ్ ఇంజినీర్ అవతారమెత్తి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వెచ్చించిన లక్షకోట్లు ఏమయ్యాయని, ముఖ్యమంత్రి రేవంత్ గతంలో ఏం మాట్లాడారో ప్రజలు గుర్తించాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు లైఫ్ లైన్ గా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది.. అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంతో ప్రజాధనాన్ని గోదావరిపాలు చేశారని ఆరోపించారు. 21 అక్టోబరు, 2023న కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగాయని, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై నాడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖ రాశామన్నారు.

దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిందని, 24 అక్టోబరు, 2023న హైలెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ప్రాజెక్టును విజిట్ చేసి జరిగిన నష్టాన్ని, నిర్మాణంలో జరిగిన పొరపాట్ల గురించి ఆరా తీసినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి చర్చించారని 20 అంశాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరితే తప్పించుకున్నారు. కేవలం 11 అంశాలపై మాత్రమే అరకొరగా సమాధానమిచ్చారని చెప్పారు.

తమ అసమర్థత, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రాజెక్టు వివరాలను బీఆర్ఎస్ సర్కారు గోప్యంగా ఉంచిందని, మూడు నాలుగేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి, నేడు నిరుపయోగంగా మారి వెలవెలబోవడం… కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి అద్దంపడుతోందన్నారు. తెలంగాణ ప్రజల కష్టార్జితం అంతా గోదావరిపాలు కావడం దురదృష్టకరమని, ప్రాజెక్టు కట్టడంలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నాడు రేవంత్ రెడ్డి.. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తోందంటూ పదేపదే మాట్లాడారు. మరి నేడు మీ వైఖరేంటో సమాధానం చెప్పాలన్నారు. ప్రాజెక్టు విషయంలో విచారణ కోసం నాడు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ను అడిగినా సీబీఐ ఎంక్వైరీకి అంగీకరించలేదని తెలంగాణలో ప్రాజెక్టులపై సీబీఐ దర్యాప్తులకు అనుమతి నిరాకరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా లేదా అని ప్రశ్నించారు. అవినీతికి, కాంగ్రెస్ పార్టీకి విడదీయలేని బంధం ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పట్ల.. కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. .

బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటేనని రెండూ బొమ్మాబొరుసు పార్టీలే అన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.. కాంగ్రెస్ పొత్తులో భాగంగానే రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారని, కాబట్టే .. దగ్గరి మిత్రుల్లా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తోలుబొమ్మలాట ఆడుతున్నాయన్నారు.

ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయిస్తామన్న రేవంత్ రెడ్డి.. నేడు సీబీఐ ఎంక్వైరీకి అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఎందుకు రాయడం లేదో సమాధానం చెప్పాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దమ్ముంటే సీబీఐ దర్యాప్తునకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించాలని ఒకవేళ సీబీఐ ఎంక్వైరీ జరపాలని కేంద్రాన్ని కోరితే 48 గంటల్లో దర్యాప్తును ప్రారంభిస్తుందని చెప్పారు.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *