Best Web Hosting Provider In India 2024
Medak Crime : మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం సొంత మేనమామనే దారుణంగా హత్య చేసిన సంఘటన మెదక్ పట్టణంలో సంచలనం రేపింది. నెల రోజుల క్రితం సిద్ధిపేటలో ఆస్తి కోసం అన్న తమ్ముణ్ణి చంపినా ఘటన చోటుచేసుకుంది. అలాంటి ఘటనే ఆదివారం రాత్రి మెదక్ పట్టణంలోని రాంనగర్ లో జరిగింది. ఆస్తి విషయంలో జరిగిన గొడవలో మేనమామను సొంత మేనల్లుడే గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి పై వివాదం
రాంనగర్ కి చెందిన సిద్దేశ్గారి ప్రభాకర్ (43), తన సోదరి యశోద, మేనల్లుడు ఏసు ఒకే వీధిలో నివాసం ఉంటున్నారు. భార్యభర్తల మధ్య వివాదాలతో, ప్రభాకర్ భార్య కొద్ది నెలలుగా పుట్టింటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో ప్రభాకర్ కు తన సోదరి యశోదకు మధ్య, వారి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి విషయంలో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ప్రభాకర్ మద్యం తాగి ఇంటికి వచ్చి ఈ విషయం పైన యశోదతో గొడవ పడ్డాడు. తల్లితో తన మామ ప్రభాకర్ గొడవ పెట్టుకోవడం యశోద కుమారుడు ఏసు చూశాడు.
కొడవలితో గొంతు కోసి
దీంతో ఆగ్రహానికి గురైన ఏసు తన ఇంట్లో ఉన్న కొడవలితో మేనమామ ప్రభాకర్ గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగగా సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తల్లి యశోద, కుమారుడు ఏసును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
రిపోర్టింగ్ : హెచ్.టి.తెలుగు ప్రతినిధి, మెదక్