Best Web Hosting Provider In India 2024
Hyderabad News : కేంద్ర మోటారు వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగారు. దీంతో దేశవ్యాప్త ట్రక్కర్స్ సమ్మె రెండో రోజుకు చేరింది. సమ్మె ప్రభావం ముఖ్యమంగా పెట్రోల్, డీజిల్ రవాణాపై పడింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు బారులు తీరారు. ఫుల్ ట్యాంక్ కోసం వాహనదారులు పట్టుబడుతుంటే….బంకు యజమానులు అందుకు నిరాకరిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల్లో వాగ్వాదాలు జరుగుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
నో స్టాక్ బోర్డులు
హైదరాబాద్‌లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూకట్టారు. పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె కారణంగా స్టాక్ రాలేదని బంకు యజమానులు అంటున్నారు. కమిషన్ పెంచాలంటూ రేపటి నుంచి ట్యాంకర్ యజమానులు కూడా సమ్మె చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. బుధవారం నుంచి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులు కూడా సమ్మెకు దిగనున్నారు. హైదరాబాద్ లోని బహీర్ బాగ్, హైదర్ గూడ, లక్డీకపూల్ సహా చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీ రద్దీ కనిపిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు
కేంద్ర మోటార్ వాహనాల చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కర్స్ సమ్మెకు దిగారు. హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణ చేసింది కేంద్రం. దీంతో పలు రాష్ట్రాల్లో ట్రక్ డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ఈ సమ్మెకు పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సైతం మద్దతు తెలిపారు. మహారాష్ట్ర, హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. ప్రమాదం చేసి పారిపోతే, ఆ కేసులో 10 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ సవరణను ట్రక్, లారీ, క్యాబ్ డ్రైవర్లు, ట్యాంకర్ల డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో కేవలం ట్రక్, లారీ డ్రైవర్లను మాత్రమే బాధ్యులను చేసే విధంగా చట్ట సవరణ ఉందని ఆక్షేపిస్తున్నారు. బాధితుల తప్పు కూడా ఉంటుదని, దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కేంద్రం ఈ సవరణను వెనక్కి తీసుకునే వరకు సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు.