Best Web Hosting Provider In India 2024
Medak News : డిసెంబర్ 31 వచ్చిందంటే మందు, ముక్క లేకుంటే సంబరాలల్లో మజా రాదు. ఈ రెండు లేకుండా సంవత్సరం చివరి రోజు సంబరాలను అస్సలు ఉహించుకోలేము. మెదక్ జిల్లాలో మద్యం అమ్మకాలు, కొత్త సంవత్సర వేడుకలు ఏ లెవెల్ లో జరిగాయి అనేదానికి ఒక నిదర్శనంగా నిలిచాయి. జిల్లాలో మందు దుకాణాలు, బార్లు, మాంసం దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2022 డిసెంబర్ నెలలో రూ. 300 కోట్ల విలువైన మద్యం అమ్మగా, 2023 డిసెంబర్ లో రూ. 376 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. కాగా డిసెంబర్ నెలలో సంగారెడ్డి జిల్లాలో రూ.180 కోట్లు, సిద్ధిపేట జిల్లాలో రూ.131 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.64 కోట్ల మద్యం అమ్ముడుపోయింది.
ట్రెండింగ్ వార్తలు
డిసెంబర్ 30, 31 రోజుల్లో 37 కోట్ల మద్యం అమ్మకం
డిసెంబర్ నెల చివరి రెండు రోజుల్లో మెదక్ జిల్లాలో గతేడాది కంటే రూ.9 కోట్ల మద్యం అధికంగా అమ్ముడుపోయింది. 2022 డిసెంబర్ 30, 31 తేదీలలో రూ. 28 కోట్ల విలువ చేసే మద్యం అమ్మగా, 2023 డిసెంబర్లో 30, 31 రోజుల్లో రూ. 37 కోట్ల అమ్మకాలు జరిగాయి. సాధారణ రోజులతో పోల్చితే, 30, 31 తేదీల్లో మద్యం అమ్మకాలు డబుల్ కంటే ఎక్కువయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 243 మద్యం దుకాణాలు, 70కి పైగా బార్లు ఉన్నాయి. వీటిలో సాధారణ రోజులలో మద్యం అమ్మకాలు రూ. 6 నుంచి రూ. 8 కోట్ల అమ్మకాలు జరుగుతుండగా, కొత్త సంవత్సర వేడుకలు పురస్కరించుకొని, అందులో శని, ఆదివారాలు కావడంతో రెట్టింపు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. సంగారెడ్డి జిల్లాలో 18,197 కేసుల మద్యం, సిద్ధిపేట జిల్లాలో 11,310 కేసుల మద్యం, మెదక్ జిల్లాలో 7, 266 కేసుల మద్యం విక్రయించారు
మందుబాబులపై కేసులు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలో ఆదివారం డిసెంబర్ 31న పోలీసులు నిర్వహించిన తనిఖీలలో 610 కేసులు నమోదు చేశారు. దీనిలో అత్యధికంగా రాంగ్ రూట్ లో వాహనం నడుపుతున్న వారిపై 250 కేసులు నమోదు చేయగా, డ్రంకెన్ డ్రైవ్ లో 150 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓవర్ స్పీడ్ వాహనాలకు 120 కేసులు,హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిపై 57 కేసులు,నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నూతన సంవత్సరం పేరుతో ఎవరైన మద్యం సేవించి రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని ముందుగానే హెచ్చరించినా వినకుండా రోడ్లపై తిరిగిన మందుబాబులపై కేసులు నమోదు చేశామన్నారు.