Best Web Hosting Provider In India 2024
Warangal Municipalities: నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీపై అవిశ్వాసం పెట్టేందుకు పలురువు కౌన్సిలర్లు రెడీ అయ్యారు. ఈ మేరకు చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వరంగల్ ఆర్డీవో వాసుచంద్రకు నోటీసు అందజేశారు.దీంతో నర్సంపేట మున్సిపాలిటీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది.
ట్రెండింగ్ వార్తలు
కౌన్సిలర్ల తిరుగుబావుటా..
నర్సంపేట మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా.. 18 మంది బీఆర్ఎస్ , ఆరుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్ పరన్స్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన గుంటి రజనీ ఉండగా.. గత కొంతకాల నుంచి ఆమెతో కౌన్సిలర్లకు సయోధ్య లేకుండా పోయింది.
చైర్ పర్సన్ ఏకపక్ష ధోరణి, ఒంటెత్తు పోకడలతో విసుగెత్తిపోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు కొందరు గత ఏడాది కిందటనే హైదరాబాద్ లో రహస్యంగా సమావేశం అయ్యారు. ఆ సమయంలో అప్పటి అధికార పార్టీ నేతలు కొందరు కలగజేసుకుని వారికి సర్దిచెప్పారు.
దీంతో అప్పటికప్పుడు అవిశ్వాస గండానికి తెరపడింది. ఆ తరువాత కూడా చైర్ పర్సన్ తీరుమార్చుకోకపోవడంతో కొద్దిరోజులుగా కౌన్సిలర్లంతా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల కిందట రహస్యంగా సమావేశమై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు.
సొంత పార్టీ కౌన్సిలర్లు కూడా..
మున్సిపల్ చైర్ పర్సన్ ఒంటెత్తు పోకడల వల్ల నర్సంపేట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కౌన్సిలర్లుగా స్థానిక సమస్యలు పరిష్కరించ లేకపోతున్నామని పేర్కొంటూ దాదాపు 17మంది కౌన్సిలర్లు సంతకాలు చేసిన లేఖతో ఆర్డీవో వాసుచంద్రకు మంగళవారం నోటీసు అందించారు.
తామంతా చైర్ పర్సన్ పట్ల విశ్వాసం కోల్పోయామని, వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందిగా ఆర్డీవోకు ప్రతిపాదించారు. ఆర్డీవోకు అవిశ్వాస ప్రతిపాదన పెట్టిన వారిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు మినుముల రాజు, శ్రీలం రాంబాబు, నాగిశెట్టి పద్మ, బానాల ఇందిర, బోడ గోల్యానాయక్, రామసహాయం శ్రీదేవి, దేవోజు తిరుమల, గడ్డమీది సునీత, వేల్పుగొండ పద్మ తదితరులున్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీని కుర్చీ దించేందుకు రంగం సిద్దం కాగా తిరిగి ఆ పోస్టును దక్కించుకునేందుకు ఇద్దరు మహిళా కౌన్సిలర్లు పోటీ పడుతున్నట్లు తెలిసింది. కాగా గుంటి రజనీపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి సిద్ధపడటం, ఆర్డీవోకు నోటీసుపై ఇవ్వడంపై నర్సంపేట పట్టణంలో తీవ్ర చర్చ నడుస్తోంది.
వర్ధన్నపేటలోనూ అదే తంతు
వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్ అంగోతు అరుణపై కూడా అవిశ్వాసానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ 12 మంది కౌన్సిలర్లు ఉండగా.. అందులో 9 మంది బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. కాగా కొన్నిరోజులుగా ఓ కౌన్సిలర్ భర్త చైర్ పర్సన్ అరుణపై అవిశ్వాసం పెట్టేందుకు మిగతా కౌన్సిలర్లతో రహస్యంగా చర్చలు జరుపుతున్నారు.
ఇందుకు 8 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపినట్లు తెలిసింది. మున్సిపాలిటీకి సంబంధించి లెక్కలు సరిగా చెప్పకపోవడం, అవినీతి ఆరోపణలపై ప్రశ్నించినా ఆమె సమాధానం చెప్పడం లేదంటూ కొందరు కౌన్సిలర్లు చెబుతుండగా.. ఆమె ఒంటెత్తు పోకడలు కూడా అవిశ్వాసానికి దారి తీసినట్లు పేర్కొంటున్నారు. అంతేగాకుండా మున్సిపల్ తీర్మానాల కాపీలు కూడా తమకు ఇవ్వడం లేదని, కొన్ని సందర్భాల్లో తమ అంగీకారం, సంతకాలు లేకుండానే ఏకపక్షంగా తీర్మానాలు చేసిందనే ఆరోపిస్తున్నారు.
దీంతోనే కొద్దిరోజులుగా మున్సిపల్ చైర్ పర్సన్ పై కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే ఆమెపై అవిశ్వాసం పెట్టేందుకు పావులు కదపగా.. అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత అందరికీ సర్దిచెప్పారు. దీంతో కొద్దిరోజుల పాటు అది కాస్త సద్దుమణిగింది.
ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, మెజారిటీ కౌన్సిలర్లు కూడా అరుణను పదవి నుంచి తప్పించేందుకు సిద్ధం కావడంతో రేపోమాపో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస ప్రతిపాదన అధికారుల వద్దకు చేరనున్నట్లు తెలిసింది. కేవలం ఈ రెండు మున్సిపాలిటీలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న తొమ్మిది మున్సిపాలిటీల్లోనూ అవిశ్వాస తీర్మానాలు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతుండటం గమనార్హం.
(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)