Best Web Hosting Provider In India 2024
Darshan Kaatera Box Office Collections: ప్రభాస్ నటించిన సలార్ లాంటి మూవీ రిలీజ్ అవుతోందంటే చిన్న సినిమాలేంటి పెద్ద సినిమాలు కూడా పక్కకు తప్పుకుంటాయి. కానీ కన్నడ స్టార్ దర్శన్ మాత్రం తన సినిమా కాటేరాను సలార్ కు పోటీగా రిలీజ్ చేశాడు. తన సినిమాను కూడా సలారే భయపడాలని ముందే వార్నింగ్ ఇచ్చాడు.
ట్రెండింగ్ వార్తలు
ఇప్పుడు దర్శన్ మూవీ కాటేరా అతడు చెప్పిందే నిజం చేస్తోంది. కర్ణాటకలో సలార్ కలెక్షన్లు, ఆక్యుపెన్సీ క్రమంగా పడిపోతుండగా.. కాటేరా దూసుకెళ్తోంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కాగా.. డిసెంబర్ 29న కాటేరా రిలీజైంది. సలార్ ను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినా కూడా కన్నడ ప్రేక్షకులు తమ సినిమాగా భావించడం లేదు. సలార్ కన్నడ వెర్షన్ 12 రోజులు కలిపి కేవలం రూ.5.09 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది.
మరోవైపు దర్శన్ నటించిన కాటేరా మూవీ తొలి రోజే రూ.11 కోట్ల ఓపెనింగ్ తో దిమ్మదిరిగే వసూళ్లు రాబట్టింది. ఇక తొలి ఐదు రోజుల్లో కన్నడ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.41.8 కోట్ల నెట్ వసూలు చేయడం విశేషం. అంటే సలార్ కన్నడ వెర్షన్ కంటే 8 రెట్లు ఎక్కువ కలెక్ట్ చేసింది. సలార్ లాంటి డబ్బింగ్ సినిమాకు తాను భయపడటం ఏంటంటూ కాటేరా రిలీజ్ కు ముందు దర్శన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
“ఓ డబ్బింగ్ సినిమాకు నేనెందుకు భయపడాలి. కాటేరా కన్నడ ప్రేక్షకుల కోసం చేసిన ఓ కన్నడ మూవీ. నాకు కన్నడ ప్రేక్షకులపై నమ్మకం ఉంది. మాకు పోటీగా సలార్ రిలీజ్ చేస్తున్నందుకు వాళ్లే భయపడాలి” అని దర్శన్ అన్నాడు. అప్పుడు అతని కామెంట్స్ చూసి చాలా మంది దర్శన్ ను ట్రోల్ చేశారు కానీ.. ఇప్పుడు అతడు చెప్పిందే నిజమైంది.
సలార్ మూవీ స్టోరీ ప్రశాంత్ నీల్ ఉగ్రంను పోలి ఉండటం కూడా కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాను అక్కున చేర్చుకోకపోవడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. మరోవైపు కాటేరా మూవీ 1970ల నేపథ్యంలో రూపొందిన సినిమా. ఇందులో జగపతి బాబు కూడా నటించాడు. తరుణ్ సుధీర్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ద్వారానే ప్రముఖ నటి మాలాశ్రీ కూతురు ఆరాధనా రామ్ నటిగా కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైంది.