Best Web Hosting Provider In India 2024
Inavolu Mallanna Swamy Temple: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం.. చాళుక్యులు, కాకతీయుల కళావైభవం ఉట్టిపడే మహిమాన్విత క్షేత్రం. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం, గొల్లకురుమలు, ఒగ్గు కళాకారుల ఆరాధ్యదైవ్యంగా పూజలందుకుంటున్న ఐలోని మల్లన్న పుణ్యక్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలకు రెడీ అయ్యింది. జానపదుల జాతరగా పిలిచే ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుండగా.. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు. మరికొద్దిరోజుల్లోనే ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. ఐలోని మల్లన్న ఆలయ ప్రాశస్త్యమేంటో మనమూ తెలుసుకుందాం..
ట్రెండింగ్ వార్తలు
చాళుక్యుల నిర్మాణ శైలి
ఐనవోలు ఆలయాన్ని కాకతీయులు నిర్మించారనే వాదనలు ఉండగా.. చాళుక్యుల కాలంలోనే నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. క్రీ.శ. 1,076– 1,127 మధ్యకాలంలో ఓరుగల్లు ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరో విక్రమాదిత్యుడు పాలించగా.. ఆ కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర పరిశోధకులు శిలాశాసనాల ఆధారంగా చెబుతున్నారు. ఆరో విక్రమాదిత్యుడి ఆస్థానంలో మంత్రిగా ఉన్న అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆయన పేరు మీదే ఈ ప్రాంతానికి అయ్యనప్రోలుగా పేరు రాగా.. కాలక్రమేణా అది కాస్త అయినవోలు, ఐనవోలుగా మార్పు చెందింది. కాగా ఈ ఆలయం అష్టోత్తర స్తంభాలు, రాతి ప్రాకారాలు, విశాల మండపాలతో ఒక రథాన్ని పోలి ఉండటం విశేషం. ఆలయం లోపల ప్రదక్షిణ మార్గం కూడా చాళుక్యుల కళా నైపుణ్యానికి అద్దం పడుతోంది.
కాకతీయుల కాలంలో తోరణాలు
కాకతీయుల కాలంలో ఐనవోలు ఆలయానికి తూర్పు, దక్షిణ దిక్కుల్లో కీర్తితోరణాలు ఏర్పాటు చేశారు. కాకతీయుల వంశంలో రెండో ప్రోలరాజు కొడుకైన రుద్రదేవుడు కాలంలో వీటిని ఏర్పాటు చేసినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇక్కడ కీర్తి తోరణాల ఏర్పాటు విషయంలో పలురకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాకతీయ రెండో ప్రోలరాజు ఒకనొక రోజున వేయి స్తంభాల గుడిలో నిద్రిస్తున్న తన కొడుకు రుద్రదేవుడిని పుత్రవాత్సల్యంతో తాకగా.. మగత నిద్రలో ఉన్న ఆయన తనను ఎవరో శత్రువులు చంపడానికి వచ్చారని భావించి ప్రోలరాజుని పొడుస్తాడు. దీంతో ప్రోలరాజు అక్కడిక్కడే మరణించగా.. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థం ఆలయానికి రెండు వైపులా కీర్తి తోరణాలు నిర్మించినట్లు చెబుతారు.
గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ సమేత మల్లన్న
ఐనవోలు మల్లికార్జున స్వామిని మల్లన్న, ఖండేల్ రాయుడని, మైలారు దేవుడని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కాగా ఆలయంలో స్వామివారి విగ్రహం దాదాపు పది అడుగుల ఎత్తులో కోరమీసాలతో ఉంటుంది. చతుర్భుజాల్లో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, పానపాత్రలుంటాయి. స్వామివారికి ఇరువైపులా దేవేరులు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. ఇక మల్లికార్జునస్వామి కుడి కాలు కింద ఆయన చేతిలో హతమైన మణి, మల్లాసురులు అనే రాక్షసుల శిరస్సులు ఉంటాయి.
జానపదుల జాతరగా పేరు
ఐలోని మల్లన్న గొల్ల, కురుమల ఇష్ట దైవం. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి ప్రత్యేకంగా వండిన బోనాన్ని సమర్పిస్తారు. ఒగ్గు పూజారులుగా పిలవబడే కురుమ పూజారులు పసుపు బండారితో పట్నాలు వేసి, ఢమరుక నాదాలకు జానపద బాణీలో స్వామివారి కథాగానం చేస్తుంటారు. భక్తులు గజ్జెల లాగులు ధరించి, నెత్తిన బోనం, చేతిలో కొరడా(చర్నాకోల)లతో తాండవిస్తుంటారు. శివసత్తులు మల్లన్నను తలుచుకుంటూ శివాలూగుతుంటారు. పల్లె ప్రజల సందడి ఎక్కువగా ఉండటం, ఆలయ ఆవరణ అంతా ఒగ్గు పూజారుల ఢమరుక చప్పుళ్లు, పసుపు బండారి పట్నాలు, గజ్జెల లాగుల నృత్యాలు కనిపిస్తుండటంతో ఈ జాతరను జానపదుల జాతరగా పిలుస్తుంటారు. కాగా స్వామివారి దర్శనానికి వచ్చే వాళ్లంతా దండదీపాలు పెట్టి, కోడె మొక్కులు చెల్లించుకుని భక్తి శ్రద్ధలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు.
మహాశివరాత్రి నుంచే సందడి
మహాశివరాత్రి సందర్భంగా ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు ధ్వజారోహణం చేసి స్వామివారిని, అమ్మవార్లని నూతన వస్ర్తాలతో అలంకరించి పూజలు చేస్తారు. మల్లన్న స్వామి పాంచాహ్నిక దీక్షతో ఐదు రోజులపాటు వరుసగా అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణవాహనాలను అధిరోహించి చివరిరోజు రథారూఢుడైన స్వామివారికి పురవీధి సేవ నిర్వహిస్తారు. ఐదో రోజున అగ్నిగుండాల కార్యక్రమం తర్వాత వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి, ఆ తర్వాత శ్రీపుష్పయాగంతో ఈ ఉత్సవాలను ముగిస్తారు.
మూడు నెలల ఉత్సవాలు
మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు కొనసాగుతాయి. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ మూడు రోజుల సమయంలో చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి దాదాపు 10 లక్షల మంది వరకు స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో స్వామి వారి జాతర ఘనంగా జరుగుతుంది. ఆయా రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తుంటారు. స్వామివారికి పెద్ద పట్నాలు వేసి, కల్యాణం జరిపించడంతో పాటు బోనాలు సమర్పిస్తారు. గజ్జెల లాగుల డ్యాన్సులతో సందడి చేస్తారు. ఒగ్గుపూజారులు స్వామివారి కథాగానంతో పాటు ఢమరుకం, డోలు వాయిద్యాలతో పూనకాలు తెప్పిస్తారు.
13 నుంచే మల్లన్న జాతర
ఈ నెల 13 నుంచి ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ మేరకు ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయ ఆవరణలో రివ్యూ చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఆఫీసర్లంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
మనమూ వెళ్లొద్దాం.. పదా..
మల్లన్న జాతరకు తెలంగాణ జిల్లాలతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఈ గుడి వరంగల్ నగరానికి దాదాపు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వరంగల్, హనుమకొండ, ఖమ్మం నుంచి ఇక్కడికి బస్సులు అందుబాటులో ఉంటాయి. జాతర సమయంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తుంటుంది. నిత్యం ప్రైవేటు వాహనాల సదుపాయం కూడా ఉంటుంది. భక్తుల విడిదికి ఇబ్బందులు కలగకుండా అక్కడ దాతల సహకారంతో మల్లన్న సదన్ నిర్మిస్తున్నారు. కానీ దాని పనులు కొంతమేరకు మాత్రమే పూర్తయ్యాయి. ఒకవేళ అక్కడ ఒకరోజైనా గడపాలనుకునే భక్తులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. ఇక కొద్దిరోజుల్లోనే మల్లన్న జాతర ప్రారంభం కానుండగా ఇప్పటి నుంచే స్వామివారి సేవకోసం భక్తులు తరలి వస్తుండటం విశేషం.
రిపోర్టింగ్ : (హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)