Best Web Hosting Provider In India 2024

CM Jagan YS Sharmila Meeting : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కలవనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు షర్మిల సీఎం జగన్ తో భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ పత్రికను షర్మిల సీఎం జగన్ కు అందించనున్నారు. వీటి భేటీలో రాజకీయ పరిణామాలపై చర్చిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ట్రెండింగ్ వార్తలు
ఇవాళే దిల్లీకి
వైఎస్ షర్మిల కుటుంబసభ్యులతో కలిసి బుధవారం కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకోనున్నారు. కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను తన సోదరుడు జగన్‌కు షర్మిల అందజేయనున్నారు. ఈ భేటీ అనంతరం షర్మిల విజయవాడ నుంచి బయలుదేరి దిల్లీ వెళ్లనున్నారు. నిన్న కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్లిన షర్మిల… తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద కుమారుడి వివాహ మొదటి పత్రిక పెట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం
2019 ఎన్నికల్లో తన సోదరుడు జగన్ విజయం కోసం పాదయాత్ర చేసిన షర్మిల… అనంతరం మారిన పరిస్థితులతో జగన్ కుటుంబానికి దూరంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం రాఖీ పూర్ణిమ సందర్భంగా జగన్ కు షర్మిల రాఖీ కట్టేవారు. గత రెండు, మూడేళ్లుగా షర్మిల…జగన్ ఇంటికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో వైసీపీతో తెగతెంపులు చేసుకున్న వైఎస్ షర్మిల… తెలంగాణ వెళ్లి సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని షర్మిల ప్రారంభించారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పదునైన విమర్శలు చేస్తూ… రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. షర్మిల చేసిన విమర్శలతో కొన్నిసార్లు బీఆర్ఎస్ కార్యకర్తల దాడులను సైతం ఎదుర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ షర్మిల కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ తో భేటీ అయ్యారు. దీంతో షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారని పెద్ద ప్రచారం జరిగింది. తెలంగాణ ఎన్నికలకు ముందు షర్మిల దిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ గాంధీతో సైతం భేటీ అయ్యారు.
అయితే కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి అంతా సిద్ధం అనుకున్న తరుణంలో అనుకోని కారణాలతో విలీనం ఆగిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో మరోసారి కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీ విలీనానికి ముందడుగు పడింది. అయితే వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇవాళ సాయంత్రం షర్మిల దిల్లీ వెళ్లనున్నారు. రేపు ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తే… అక్కడ రాజకీయ పరిస్థితుల మారతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.