
Best Web Hosting Provider In India 2024

Breakfast: రోజులో భోజన సమయాలు చాలా ముఖ్యమైనవి. ప్రధానంగా అల్పాహారం, రాత్రి భోజనం… గుండె ఆరోగ్యం పై నేరుగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వాటిని తినడానికి ఒక సమయం అంటూ ఉంటుంది. ఉదయం అల్పాహారం తినడానికి సరైన సమయాన్ని వివరిస్తోంది ఒక తాజా అధ్యయనం. రోజులో మొదటి భోజనమైన అల్పాహారం ఆలస్యం అవుతున్న కొద్దీ గంటకు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఆరు శాతం పెరుగుతున్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది.
ట్రెండింగ్ వార్తలు
నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం రోజులో మీరు తినే మొదటి భోజనం మీ గుండెపై ప్రభావాన్ని చూపిస్తుంది. అది సమయానికి తింటే సానుకూల ప్రభావం చూపిస్తుంది, అదే ఆలస్యమవుతున్న కొద్దీ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధనా బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. లక్ష మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు పరిశోధనకర్తలు.
ఎన్ని గంటలకు తినాలి?
భోజనం ఆలస్యం అవుతున్న కొద్దీ గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి. ఇది హృదయ సంబంధ వ్యాధులకు కారణం అవుతాయి. ముఖ్యంగా కరోనరీ హార్ట్ డిసీజ్, రక్తపోటులో హెచ్చుతగ్గులు, గుండె లయ మారడం, స్ట్రోక్, గుండె ఆగిపోయే ప్రమాదం వంటివి పెరుగుతాయి. ఒక వ్యక్తి పగటిపూట తినే అల్పాహారం ఆలస్యం చేస్తున్న కొద్ది గంటకు ఆరు శాతం గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతూ వస్తుంది. అందుకే ప్రతిరోజూ ఒకే సమయానికి బ్రేక్ ఫాస్ట్ తినాలి. ముఖ్యంగా అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు అల్పాహారం తినడం అలవాటు చేసుకుంటే గుండె వ్యాధులు రాకుండా ఉంటాయి.
ప్రపంచంలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ప్రతి ఏటా కేవలం గుండె సమస్యల కారణంగానే కోటి డబ్బై లక్షల మందికి పైగా మరణిస్తున్నట్టు సమాచారం. కాబట్టి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా గుండెను కాపాడుకోవాలి. సరైన సమయంలో సరైన ఆహారాన్ని తినడం, వ్యాయామం చేయడం, శరీరానికి సరిపడా నిద్రపోవడం ద్వారా గుండెను కాపాడుకోవచ్చు. రాత్రి ఏడున్నరకు భోజనం ముగిస్తే ఇంకా మంచిది. రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేసే అలవాటు ఉన్నవారిలో గుండె సమస్యలు పెరిగిపోయే అవకాశం ఎక్కువ.