Best Web Hosting Provider In India 2024
హిప్నోథెరపీ లేదా హిప్నాటిజం… మాటల ద్వారానే ఎదుటి వ్యక్తిని మనుసు ఆధీనంలోకి తీసుకునే ఒక సమ్మోహన విద్య. ప్రపంచ వ్యాప్తంగా దీనికి ఆదరణ ఉంది. హిప్నాటిజం వల్ల ఎంతో మంది వ్యక్తులు చికిత్స పొంది సాధారణ వ్యక్తులుగా మారారు. అయితే ఇప్పటికీ దీనిపై ప్రజల్లో ఉన్న అవగాహన చాలా తక్కువ. హిప్నో థెరపీ లేదా హిప్నాటిజంపై అవగాహన కల్పించడానికి, దాని చుట్టూ ఉన్న అపోహలను తొలగించడానికి ప్రతి సంవత్సరం జనవరి 4 న ప్రపంచ హిప్నాటిజం దినోత్సవం జరుపుకుంటారు. ధూమపానం మానేయడం వల్ల కలిగిన ఇబ్బందులు, మద్యపానం మానేయడం వల్ల ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు, శస్త్రచికిత్స లేదా ప్రసవం వల్ల కలిగే నొప్పి, ఆందోళనను తగ్గించడం వంటి వాటిని ఎదుర్కొనేందుకు హిప్నాసిస్ సహాయపడుతుంది. హిప్నాటిజం చికిత్స చేయించుకోవాలనుకునే వారు సర్టిఫైడ్ హిప్నాటిస్టు వద్దకే వెళ్లాలి.
ట్రెండింగ్ వార్తలు
హిప్నాసిస్ చరిత్ర
హిప్నాటిజం మూలాలు 1770 లో వియన్నా, పారిస్ లలో కనిపిస్తాయి. అక్కడ ఉన్న రోగులకు చికిత్స చేయడానికి జర్మన్ వైద్యుడు ఫ్రాంజ్ మెస్మర్ దీనిని ఉపయోగించడం ప్రారంభించారని చెబుతారు. అతని పద్ధతి నుండి ప్రేరణ పొంది, ఇతర వైద్యులు కూడా దీనిని అభ్యసించడం ప్రారంభించారు. మొదట్లో దీన్ని దీనిని మెస్మరిజం అని పిలిచేవారు. కొన్ని నెలల్లోనే ఈ పద్ధతి ఒక రకమైన క్షుద్రపూజల్లా ప్రజలు అర్థం చేసుకునక్నారు. దీంతో దీన్ని వినియోగించడం మానేశారు. ఆ తరువాత స్కాటిష్ సర్జన్ జేమ్స్ బ్రైడ్ దీనిని పునరుద్ధరించి, ఈ వైద్యానికి ‘హిప్నాటిజం’ లేదా ‘హిప్నాసిస్’ అని పేరు పెట్టాడు.
ప్రపంచ హిప్నాటిజం కమిటీ సభ్యుడైన హిప్నాటిస్ట్ టామ్ నికోలి 2004 సంవత్సరంలో హిప్నాటిజంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ హిప్నాటిజం దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జనవరి 4న ఈ హిప్నాటిజం డేను నిర్వహిస్తున్నారు. జీవితంలో సానుకూల మార్పును తీసుకురావడానికి ఒక సాధనంగా హిప్నాటిజాన్ని చెబుతారు హిప్నాటిస్టులు .
హిప్నటైజ్ అయినప్పుడు ఏమవుతుంది?
ఒక వ్యక్తిని హిప్నాటిస్టులు తమ మాటలు, కంఠస్వరం ద్వారా హిప్నాటైజ్ చేస్తారు. అది వారి మనస్సు, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. హిప్నాటిస్టు చెప్పిన పనులను ఆ వ్యక్తి చేస్తాడు. ఆ సమయంలోనే దీర్ఘకాలంగా బాధపడుతున్న విషయాలను బయటపెట్టమని అడుగుతారు వైద్యులు. ఆ వ్యక్తి జ్ఞాపకాలు, అనుభూతులు, ఆలోచనలు, ప్రవర్తనలలో సానుకూల మార్పులు నింపుతారు. ఇది ఒక వ్యక్తి వారి జ్ఞాపకాలలో ఉన్న గాయాలు మానేందుకు, జీవితంలో సవాళ్లను ఎదుర్కునేందుకు సహాయపడుతుంది.
హిప్నాసిస్ ప్రయోజనాలు
- హిప్నాసిస్ దీర్ఘకాలిక నొప్పిని ఎదుర్కోవటానికి, శస్త్రచికిత్సల సమయంలో నొప్పిని నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.
- ఒత్తిడి, ఆందోళనను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
- హిప్నాసిస్ ఒక వ్యక్తి భయాన్ని అధిగమించడానికి, విజయాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది.
- భయం నుండి బయటపడటానికి సహాయపడుతుంది.
హిప్నాటిజం చేసి ఎదుటి వారి మనస్సుతో ఆడుకుంటారని,వారి చేత అనేక రకాల పనులు చేయిస్తారని, ఇష్టం లేని విషయాలను బయటికి చెప్పేలా చేస్తారనే అపోహలు ప్రజల్లో ఉన్నాయి. అందుకే ఎవరికి పడితే వారికి హిప్నాసిస్ చేయకూడదు. వైద్యం కోసం మాత్రమే దీన్ని చేయాలి. హిప్నాటిజం చేసిన వ్యక్తి గాఢమైన నిద్రాస్థితిలోకి వెళ్లిపోతారు. మనసు పొరల్లో ఉన్న విషయాలలో బాధపెట్టిన వాటినే బయటపెడతాడు.
హిప్నాసిస్ అందరికీ సురక్షితమేనా?
కొన్ని అరుదైన సందర్భాల్లో హిప్నాసిస్ వల్ల ఆందోళన, మగత, మైకం వంటి దుష్ప్రభావాలను కలుగుతాయి. మీరు సర్టిఫైడ్ హిప్నాటిస్టు దగ్గర మాత్రమే చికిత్స తీసుకోవాలి. స్కిజోఫ్రెనియా, భ్రాంతులు, భ్రమలు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చికిత్స చేయించుకోకపోవడమే మంచిది.