
Best Web Hosting Provider In India 2024

KishanReddy: దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని అర్జీలు అవసరం లేకుండా ఎన్నికల్లో హామీలు నిలబెట్టుకునే అవకాశం ఉందని, రాజకీయ దృక్పథంతోనే అభయహస్తం ఫారంలను తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
ట్రెండింగ్ వార్తలు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల నేపథ్యంలో దరఖాస్తులు చేయకపోతే ఎలాంటి సాయం అందదని ప్రచారం చేస్తున్నారని, పథకాల అమలు విషయంలో కేవలం కాలయాపన చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశమన్నారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని.. అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు సమర్పించాలని ఎలా అడుగుతోందన్నారు. ఉద్యమం సమయంలో జైలుకు వెళ్లినవారు ఎఫ్ఐఆర్ పత్రం సమర్పించాలని అడగటం వెనుక మతలబు ఏమిటన్నారు.
ఉద్యమకారులు, ప్రజలు జైలుకు వెళ్లిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని, దరఖాస్తుల్లో వివరాలివ్వాలని అడగడం చూస్తుంటే.. ప్రజలను మరోసారి జైళ్ల చుట్టూ.. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలనుకోవాలని చూస్తున్నారన్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వాలనుకున్నపుడు ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంటుందన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలకు ఇస్తారా.. లేక మహిళలందరికీ ఇస్తారా అనేది స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు.
కేంద్రప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏడాది రైతులకు రూ. 6 వేల చొప్పున ఇస్తోందని రైతుబంధు ఆల్‌రెడీ అమలులో ఉన్న పంపిణీ పథకమేనని ఆ డేటా ఉన్నప్పుడు మళ్లీ దరఖాస్తులెందుకని ప్రశ్నించారు.
వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, గ్రామీణ ఉపాధిహామీ పథకం కార్డు నెంబర్లు ఇవ్వాలనడం వెనుక మర్మం ఏమిటన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు దరఖాస్తుల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ తిప్పుకోడానికి తప్ప లబ్ధి చేకూర్చే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన స్కాం ఆరోపణల విషయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ (న్యాయ విచారణ)తో పాటు విచారణను వేగవంతం చేసేలా సీబీఐ దర్యాప్తుకు కొత్త ముఖ్యమంత్రి కోరాలని మొన్ననే చెప్పానని, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు సీబీఐ ఎంక్వైరీ అనగానే కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా.. విన్నవించుకునే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. సీబీఐ మీద అప్పుడు అభ్యంతరాలు లేనప్పుడు… ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్ కేంద్రప్రభుత్వానికి సీబీఐ దర్యాప్తు కోరుతూ ఉత్తరం రాయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేసి కేసీఆర్ ను రక్షించాలనుకుంటోందని, గతంలో బీఆర్ఎస్ తో పొత్తపెట్టుకుని, అధికారం పంచుకున్నది కాంగ్రెస్ పార్టీ అని. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.