Best Web Hosting Provider In India 2024
Sangareddy Murder: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో ఓ అల్లుడు అత్తను అతి కిరాతకంగా హత్య చేశాడు. అడ్డుకోబోయిన భార్య గొంతు కోయడంతో, ప్రస్తుతం ఆమె అసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది.
ట్రెండింగ్ వార్తలు
ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే పఠాన్ చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన శాంతమ్మ తన కూతురు (23) సత్యవతిని, రుద్రారం గ్రామానికి చెందిన సాయిబాబాకు ఇచ్చి మూడు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. పెళ్లయిన తర్వాత రెండేళ్లు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు.
ఆ తర్వాత భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరిగాయి. ఇలానే మరోసారి గొడవ జరగడంతో, సత్యవతి ఇస్నాపూర్‌లోని పద్మారావు నగర్లో ఉంటున్నతన తల్లి గారింటికి వెళ్ళింది. కాగా ఆమె తల్లి తండ్రులు పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో సాయిబాబాను పిలిపించి నచ్చజెప్పి మరల అతనితో పంపించారు.
కొద్ది రోజులుగా పుట్టింట్లోనే….
భర్తతో కాపురానికి వెళ్లిన తర్వాత కూడా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. భర్తతో వేగలేక, సత్యవతి గత కొన్నిరోజులుగా పుటింట్లోనే ఉంటుంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, అయినా సమస్య ఒక కొలిక్కిరాలేదు.
ఈ నేపథ్యంలో, సత్యవతిని తనతో కాపురానికి రాకుండా అత్త అడ్డు పడుతోందని కక్ష పెంచుకున్న సాయిబాబా, బుధవారం రోజు శాంతమ్మ ఇంటికి వెళ్ళాడు. ఇదే విషయంలో అత్త, భార్యతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. మాట మాట పెరిగి, సాయిబాబా ఆవేశంలో కత్తితో శాంతమ్మ పై దాడికి దిగాడు.
అడ్డుకోబోయిన, సత్యవతి గొంతు కోశాడు. వారిద్దరూ అరుపులు విని, పరిగెత్తుకుంటా వచ్చిన స్థానికులను చూసి సాయిబాబు అక్కడినుండి తప్పించుకున్నాడు . తర్వాత తాను, పఠాన్ చెరువు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు సమాచారం. రక్తపు మడుగులో పడిఉన్న, శాంతమ్మని అప్పటికి చనిపోయిందని గమనించి, కొన ఊపిరితో ఉన్న సత్యవతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. పఠాన్ చెరువు డిఎస్పీ ఫురుశోత్తం రెడ్డి మాట్లాడుతూ తాము కేసు విచారణ చేస్తున్నామని, త్వరలో పూర్తి సమాచారం వెల్లడిస్తామన్నారు