Best Web Hosting Provider In India 2024
Pudina Rice: పుదీనాతో చేసిన వంటలు ఆరోగ్యానికి చాలా మంచివి. డిన్నర్లో వేడి వేడి పుదీనా రైస్ తింటే టేస్టీగా ఉంటుంది. పుదీనా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకులతో చేసే టేస్టీ వంటకం పుదీనా రైస్. ఇది పిల్లలకు, పెద్దలకు నచ్చుతుంది. చికెన్ కర్రీతో ఈ రైస్ తింటే రుచిగా ఉంటుంది. పుదీనా వంటకాలు తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
పుదీనా రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం – ఒక కప్పు
పుదీనా కట్ట – ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
పచ్చిమిర్చి – ఎనిమిది
లవంగాలు – రెండు
దాల్చిన చెక్క – ఒక చిన్నముక్క
జీలకర్ర – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
పసుపు – అరస్పూను
ఉప్పు – రుచికి సరిపడా
బిర్యానీ ఆకు – రెండు
ఉల్లిపాయ – ఒకటి
పుదీనా రైస్ రెసిపీ
1. స్టవ్ కుక్కర్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
2. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, నిలువుగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.
3. అందులో పసుపు వేసి కలపాలి. పుదీన ఆకులను ఏరి మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఇందులో కాస్త నీళ్లు పోయాలి.
4. ఆ పుదీనా పేస్టును ఉల్లిపాయల మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
5. రుచికి సరిపడా ఉప్పును వేయాలి. అన్నీ వేగాక అందులో బియ్యం వేయాలి.
6. బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను వేయాలి. పైన కరివేపాకులు వేసి కుక్కర్ మూత పెట్టేయాలి.
7. మూడు విజిల్స్ కు స్టవ్ కట్టేయాలి. అంతే పుదీనా రైస్ రెడీ అయినట్టే. దీన్ని చికెన్ కర్రీతో తింటే రుచి అదిరిపోతుంది.
పుదీనాతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. దీనిలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువ. వీటిని తినడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. నల్ల మచ్చలు, దద్దుర్లు తగ్గుతాయి. పుదీనా ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, క్యాల్షియం వంటివి శరీరానికి అందుతాయి. పుదీనా ఆకులను నూరి ముఖానికి పట్టిస్తే ఎంతో మంచిది. చర్మం మెరిసిపోవడం ఖాయం. మొటిమలను తగ్గించే శక్తి దీనికి ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్న వారు పుదీనా ఆకులు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీని వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారు కూడా పుదీనాతో వండిన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి.
టాపిక్