Best Web Hosting Provider In India 2024

Eagle postponed: సంక్రాంతి రేసులో ఈసారి ఐదు సినిమాల బదులు నాలుగు సినిమాలే ఉండనున్నాయి. రవితేజ నటించిన ఈగల్ మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ విన్నపాన్ని మన్నించినందుకు నిర్మాత దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపాడు.
ట్రెండింగ్ వార్తలు
సంక్రాంతి రేసులో ఉన్న ఐదు సినిమాల నుంచి ఒకటి వెనక్కి వెళ్లడంతో మిగిలిన నాలుగు సినిమాలకు మంచి జరుగుతుందని దిల్ రాజు ప్రెస్ మీట్ లో అన్నాడు. ఈగల్ మూవీ తప్పుకోవడంతో ప్రస్తుతం సంక్రాంతికి గుంటూరు కారంతోపాటు హనుమాన్, సైంధవ్, నా సామి రంగా రిలీజ్ కానున్నాయి. మిగతా సినిమాలకు ఇప్పుడు దారి ఇవ్వడంతో ఈగల్ మూవీకి బెస్ట్ సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ఫిల్మ్ ఛాంబర్ హామీ ఇచ్చింది.
నిజానికి రవితేజ నటించిన ఈగల్ మూవీ జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉంది. అంతకుముందు రోజు అంటే జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్ రిలీజ్ అవుతున్నాయి. జనవరి 13న సైంధవ్ వస్తోంది. ఇప్పుడు ఈగల్ వాయిదా పడటంతో మిగిలిన సంక్రాంతి సినిమాలకు కాస్త పోటీ తగ్గనుంది. దీంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున నిర్మాత దిల్ రాజు ఈ మూవీ మేకర్స్ కు థ్యాంక్స్ చెప్పాడు.
గురువారం (జనవరి 4) సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు.. ఈగల్ మూవీ మేకర్స్ తో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో అందరూ కలిసి మాట్లాడారు. పరిస్థితిని అర్థం చేసుకొని ఈగల్ ను వాయిదా వేసినందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రవితేజకు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపాడు. ఒక్క సినిమా పక్కకు జరగడం వల్ల మిగిలిన సినిమాల రెవెన్యూ కాస్తయినా పెరుగుతుందని అతడు అభిప్రాయపడ్డాడు.
ఈగల్ రిలీజ్ ఎప్పుడంటే?
ఈగల్ కు మంచి రిలీజ్ డేట్ ఇస్తామని ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ తరఫున దిల్ రాజు మాట ఇచ్చాడు. ఆ వెంటనే ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుందని వెల్లడించారు. నిజానికి అదే రోజు టిల్లూ స్క్వేర్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గుంటూరు కారం నిర్మాత అయిన నాగవంశీయే ఆ మూవీకి కూడా నిర్మాత. ఇప్పుడు ఈగల్ తప్పుకోవడంతో అప్పుడు తన సినిమాను వాయిదా వేయడానికి అతడు అంగీకరించాడు.
దీంతో ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన టిల్లూ స్క్వేర్ మూవీకి మరో వాయిదా తప్పదు. ఇక అదే రోజు యాత్ర 2 కూడా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే తాను యూవీ క్రియేషన్స్ తో మాట్లాడి ఆ మూవీని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తానని దిల్ రాజు హామీ ఇచ్చాడు. ఈగల్ ను సోలో మూవీగా రిలీజ్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని స్పష్టం చేశాడు.