Animal Movie: యానిమల్ చాలా ప్రమాదకరమైన సినిమా: బాలీవుడ్ లిరిసిస్ట్ సంచలన వ్యాఖ్యలు

Best Web Hosting Provider In India 2024

Animal Movie: రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా నటించిన యానిమల్ మూవీపై మరో నెగటివ్ కామెంట్ వచ్చింది. ఈసారి బాలీవుడ్ లిరిసిస్ట్ జావెద్ అక్తర్ ఈ సినిమాను చాలా ప్రమాదకరమైనదిగా అభివర్ణించాడు. ఓ మగాడు ఓ ఆడదానితో తన షూ నాకమని చెప్పే సీన్ ఉన్న సినిమాను ఇంత పెద్ద హిట్ చేశారంటే అది కచ్చితంగా ప్రమాదకరమే అని అతడు అనడం గమనార్హం.

 

ట్రెండింగ్ వార్తలు

యానిమల్ మూవీ గతేడాది డిసెంబర్ 1న రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.890 కోట్లకుపైగా వసూలు చేసి సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు ఎన్ని పాజిటివ్ రివ్యూలు వచ్చాయో అదే స్థాయిలో నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. మితిమీరిన హింస, సెక్స్ సీన్లు, మహిళలను కించపరిచేలా ఉన్న సీన్లు, డైలాగులపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇది డేంజరస్ ట్రెండ్: జావెద్ అక్తర్

యానిమల్ మూవీలోని సీన్స్ కంటే అలాంటి సీన్స్ ఉన్నా కూడా దానిని ఇంత పెద్ద హిట్ చేయడమే అసలు ప్రమాదకరమని జావెద్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఈ మధ్యే అతడు ది అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యాడు. అక్కడ మాట్లాడుతూ.. ఈ సినిమా తీసిన మేకర్స్ ను కాకుండా దానిని ఆదరించిన ప్రేక్షకుల గురించి అక్తర్ మాట్లాడాడు.

“ఓ మగాడు ఓ ఆడదానితో తన షూ నాకాలని అడిగే సీన్ ఉన్న సినిమా అది. ఓ ఆడదాన్ని కొడితే తప్పేముంది అని ఓ మగాడు అనే సినిమా అది. అలాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందంటే అది చాలా ప్రమాదకరమైన విషయం” అని జావెద్ అక్తర్ అన్నాడు. మూడు దశాబ్దాల కిందట ఖల్ నాయక్ మూవీలోని ఛోలీ కే పీచే క్యా హై పాట ఉదాహరణను ఈ సందర్భంగా అతడు ప్రస్తావించాడు.

 

“ఈ రోజుల్లో అసలు ఎలాంటి పాటలు వస్తున్నాయి అని అందరూ నన్న అడుగుతున్నారు. పాటలను ఏదో ఆరేడు మంది మాత్రమే చేస్తారు. ఛోలీ కే పీచే క్యా హై పాటను ఓ వ్యక్తి రాశాడు. ఇద్దరు కంపోజ్ చేశారు. ఇద్దరు యువతులు డ్యాన్స్ చేశారు. ఓ కెమెరామ్యాన్ షూట్ చేశాడు. ఈ 8, 10 మంది సమస్య కాదు. అసలు సమస్య ఏంటంటే.. ఈ పాట సూపర్ హిట్ కావడం. కోట్లాది మందికి ఈ పాట నచ్చింది. ఇదే నన్ను భయపెడుతుంది” అని జావెద్ అక్తర్ అన్నాడు.

సినిమా తీసేవాళ్ల కంటే సినిమా చూసేవాళ్లపైనే ఎక్కువ బాధ్యత ఉంటుందని కూడా ఈ సందర్భంగా అక్తర్ స్పష్టం చేశాడు. “ఇది మీ బాధ్యత. ఎలాంటి సినిమా తీయాలో, ఎలాంటి సినిమా తీయకూడదో మీరు నిర్ణయించాలి. మన సినిమాల్లో ఎలాంటి సంస్కారం ఉండాలి.. ఎలాంటి విలువలు ఉండాలి.. ఎలాంటి నైతికత ఉండాలి.. ఎవరిని నిరాకరించాలి అన్నది మీరు నిర్ణయించాలి” అని జావెద్ అక్తర్ అన్నాడు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024