Best Web Hosting Provider In India 2024
Kidney Stones with Sugar: కూల్ డ్రింకులు, చక్కెర కలిపిన పండ్ల రసాలు, చాక్లెట్లు, కేకులు, ఐస్ క్రీములు… వీటన్నింటిలోనూ పంచదార అధికంగానే ఉంటుంది. వీటిని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. తిన్నప్పుడు ఇవి రుచిగానే ఉంటాయి కానీ శరీరంలో చేరాక మాత్రం తాము చేయాల్సిన చేటును చేస్తాయి. మన ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఒకవేళ తెలిసినా చక్కెర నిండిన ఆహారాలను దూరంగా ఉంచేందుకు ఇష్టపడరు. ఇలా చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల భవిష్యత్తులో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తాజా అధ్యయనాల్లో ఈ విషయం బయటపడింది.
ట్రెండింగ్ వార్తలు
కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి అనగానే ఎక్కువమంది ఊబకాయం వల్ల, ఒంట్లో నీటి శాతం తగ్గడం వల్ల, మధుమేహం వల్ల అనుకుంటారు. వాటి వల్లే కాదు పంచదార నిండిన పదార్థాలను అధికంగా తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య పెరుగుతుంది. యూఎస్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో ఈ విషయం బయటపడింది. శరీరానికి అవసరం అయ్యే రోజువారీ కేలరీలలో ఐదు శాతం కన్నా తక్కువగా చక్కెర కలిపిన పదార్థాలను తీసుకోవాలి. ఎవరైతే రోజువారి కేలరీలలో 25% కన్నా ఎక్కువ చక్కెర నిండిన పదార్థాలు తీసుకుంటారో వారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం 88% పెరుగుతుంది.
చక్కెర నిండిన ఆహారాలు తినడం వల్ల శరీరంలో గ్లూకోజ్ అధికంగా పెరిగిపోతుంది. అలాగే మూత్రంలో క్యాల్షియం, ఆన్సలేట్ మోతాదులు పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా మూత్రంలో స్పటికాలుగా మారుతాయి. అవే భవిష్యత్తులో రాళ్లగా ఏర్పడి కిడ్నీలలో, మూత్రనాళాల్లో ఇరుక్కుంటాయి. ఈ రాళ్ల సమస్య వల్ల ఇబ్బంది అధికంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఇప్పటికే ఉన్నవారు చక్కెర వాడకాన్ని చాలా వరకు తగ్గించాలి. వారు పూర్తిగా తీసుకోకపోవడమే మంచిది. ఎక్కువ చక్కెరను తింటే మూత్రంలో ఆమ్లత్వం కూడా పెరుగుతుంది. యూరిక్ ఆమ్లం కూడా రాళ్లు ఏర్పడడానికి సహకరిస్తుంది కాబట్టి అవసరానికి మించి చక్కెరను తీసుకోకూడదు. నిజానికి పంచదారను పూర్తిగా మానేయడమే మంచిది. అప్పుడప్పుడు చిన్న బెల్లం ముక్కను తినడం ద్వారా తీపి పదార్థాల రుచిని చూడవచ్చు. పంచదారను తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, పైగా భవిష్యత్తులో మధుమేహం బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. పంచదారకు బదులు తేనె, బెల్లంతో సరిపెట్టుకుంటే మంచి ఆరోగ్యం కూడా అందుతుంది.