AP Govt ESMA Orders : అంగన్వాడీల సమ్మెపై ఏపీ సర్కార్ సీరియస్ – ‘ఎస్మా’ ఉత్తర్వులు జారీ

Best Web Hosting Provider In India 2024

AP Govt ESMA Orders : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువచ్చింది. ఈ మేరకు జీవో నెంబరు 2ను విడుదల చేసింది. ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు చేయటం నిషేధమని పేర్కొంది.

 

ట్రెండింగ్ వార్తలు

కొద్దిరోజులుగా ఏపీలో పని చేస్తున్న అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్ష శిబిరాలు వేసుకొని నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన మంత్రుల బృందం ఆయా సంఘాల ప్రతినిధులతో చర్చలు కూడా జరిపింది. జనవరి 5 నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు,బాలింతలు,చిన్నారులకు టేక్ హోం రేషన్ సహా వివిధ సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేయాలని విజ్ణప్తి చేశారు. సంక్రాంతి అనంతరం మరలా కూర్చుని చర్చించుకుని అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని విజ్ణప్తి చేశారు.

ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించి 11 డిమాండులకు గాను 10 డిమాండులను పరిష్కరించడమే గాక 4అంశాలకు సంబంధించి అనగా పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 ఏళ్ళకు పెంపు, పదోన్నతి వయస్సు 45 నుండి 50 ఏళ్ళకు పెంపు, టిఏడిఏలు,అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని50 వేల రూ.లు నుండి లక్ష రూ.లకు, సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని 25 వేల నుండి 40 వేల రూ.లకు పెంచడం వంటి వాటిపై జిఓలను కూడా జారీ చేశామన్నారు మంత్రులు. మిగతా అంశాలపై త్వరలోనే జిఓలను జారీ చేయడం జరుగుతుందని మంత్రుల బృందం స్పష్టం చేశారు.ఒకే ఒక్క డిమాండు అనగా గౌరవ వేతనం పెంపు అంశం మిగిలి ఉందని దీనిపై సంక్రాంతి తర్వాత మరలా సమావేశమై చర్చించి దానిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకుందామని మంత్రులు వారితో చెప్పారు.

 

అంగన్వాడీల గ్రాట్యుటీ అంశానికి సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని కూడా మంత్రులు చెప్పారు. అంగన్వాడీల సమస్యల పరిస్కారం పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని కావున సమ్మెను సంక్రాంతి వరకూ వాయిదా వేయాలని మంత్రుల బృందం విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్లు,సహాయకుల సంఘాల తరుపున పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడుతూ… వేతనం పెంపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో విజ్ణప్తి చేశారు. ప్రస్తుత ధరల దృష్ట్యా చాలీచాలని వేతనంతో కుటుంబాలను పోషించు కోవడం కష్టంగా ఉందని గౌరవ వేతనం పెంపునకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మె ఉధృతం చేయనున్నట్లు కూడా అంగన్‌వాడీ సంఘాల నాయకులు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే…. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ అనుబంధ సంఘాలు సమ్మెను కొనసాగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సమ్మెపై దృష్టిపెట్టిన ఏపీ సర్కార్…. ఎస్మా ప్రయోగిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఎస్మా ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో… అంగన్వాడీల సమ్మె ఏ విధంగా సాగబోతుందనేది ఉత్కంఠగా మారింది.

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024