Best Web Hosting Provider In India 2024

AP Anganwadi Protest : జనవరి 5వ తేదీ లోపు విధుల్లో చేరాలని అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వేతనాల పెంపు, గ్రాట్యూటీపై స్పష్టత వచ్చే వరకూ విధుల్లో చేరబోమని అంగన్వాడీలు గత 26 రోజులుగా ధర్నా చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నెంబర్ 2 జారీ చేసింది. ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేదిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఎస్మా ప్రయోగం దారుణం- నారా లోకేశ్
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తప్పుబట్టారు. ఈ మేరకు లోకేశ్ ఎక్స్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. “అమ్మనే గెంటేసినవారికి అంగన్వాడీల విలువ ఎం తెలుస్తుంది? పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అంగన్వాడీ ఉద్యమం పై వైసీపీ సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణం. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం.. జగన్ నియంత పోకడలకు పరాకాష్ట. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీఓ నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలి. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. జగన్ అహంకారానికి…అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదే” అని పోస్టు పెట్టారు.
ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుంది?
ఏపీలో 26వ రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరపింది. అంగన్వాడీల పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే అన్ని డిమాండ్ల పరిష్కారమయ్యే వరకు సమ్మె ఆపేది లేదని అంగన్వాడీలు అంటున్నారు. ముఖ్యంగా జీతాల పెంపు, గ్రాట్యుటీపై పట్టుబడుతూ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ శనివారం జీఓ నెం.2 తీసుకొచ్చింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలలు పాటు సమ్మెను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసులు కిందకు రానప్పటికీ, వారిని అత్యవసర సర్వీసుల కింద పరిగణిస్తూ ప్రభుత్వం ఈ జీఓ తీసుకువచ్చింది. 2013 జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 కింద అంగన్వాడీలు అత్యవసర సర్వీసులు కిందకు వస్తారని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 1971 ఎస్మా చట్టం కింద సమ్మెను నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తే వారిని డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీంతో పాటు సమ్మెలో ఉన్నవారిని విచారించే అవకాశం ఉంటుంది. సమ్మె చేసిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష, సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఎస్మా చట్టం చెబుతోంది.