Best Web Hosting Provider In India 2024
Medak News : ఒక్కగానొక్క కొడుకు గుండెపోటుతో చనిపోయాడని తెలిసిన మరుక్షణమే, అతని తల్లి ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. తల్లి, కొడుకు గుండెపోటు తో మరణించిన విషాదకర సంఘటన మెదక్ జిల్లాలోని హవేళిఘన్పూర్ మండలంలోని కూచన్ పల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామంలో వీరప్పగారి నర్సా గౌడ్ (39), తన భార్య ఇద్దరు పిల్లలు తల్లి లక్ష్మి (60) తో కలిసి నివసిస్తున్నాడు. లక్ష్మికి నర్సా గౌడ్ తో పాటు మరొక కూతురు ఉండేది. కానీ ఆమె పాము కాటుతో కొంతకాలం క్రితం మరణించింది. తరువాత లక్ష్మి భర్త కూడా మరణించడంతో, నర్సా గౌడ్ ఒక్కడే ఆటో నడుపుతో తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ మధ్యలో ఆటో సరిగా నడువక, నర్సా గౌడ్ పై అప్పుల భారం పెరిగిందని గ్రామస్తులు చెప్పారు. ఆర్థికంగా తీవ్ర కష్టాలను ఎదురుకుంటున్న నర్సా గౌడ్ శనివారం ఉదయం గుండెలో నొప్పిగా ఉందని భార్యతో చెప్పాడు.
ట్రెండింగ్ వార్తలు
హుటాహుటిన మెదక్ ఆసుపత్రికి
తీవ్రమైన నొప్పితో నర్సాగౌడ్ మంచంలో పడిపోవటంతో పక్కింటివారి సహాయంతో అతడ్ని హుటాహుటిన మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నర్సా గౌడ్ ని పరిశీలించిన డాక్టర్ అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. దీంతో బంధువులు అతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కొడుకు మృతదేహం వాహనంలో నుంచి కిందకకు దింపటం చూసిన అతడి తల్లి లక్ష్మి ఒక్కసారిగా గుండాలవిసేలా ఏడవటం ప్రారంభించింది. అలా ఏడుస్తూ ఆమె కూడా కొడుకు మృతదేహం పక్కనే పడిపోయింది. హుటాహుటిన పక్కింటివారు డాక్టర్ ని పిలుచుకొచ్చారు. ఆమెను పరిశీలించిన డాక్టర్ అప్పటికీ లక్ష్మి చనిపోయినట్టు చెప్పటంతో అందరు హతాశులయ్యారు.
నర్సా గౌడ్ అంటే తల్లికి ఎంతో ప్రేమ
గంటల వ్యవధిలో తల్లి కొడుకులు మృతి చెందటంతో, నర్సా గౌడ్ భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారని గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. వారిద్దరి మరణంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. లక్ష్మికి చిన్నప్పటి నుంచి కొడుకు నర్సా గౌడ్ అంటే ఎంతో ప్రేమని, ఒక్కగానొక్క కొడుకు తన ముందే అకాల మరణం పొందేసరికి తట్టుకోలేక పోయిందని గ్రామస్తులు అన్నారు. ప్రభుత్వం, నర్సా గౌడ్ కుటుంబానికి ఆదుకొని తగిన ఆర్థిక సహాయం చేయాలని గ్రామస్తులు కోరారు.