Andhrapradesh : 5 నదులు ఒకే చోట కలిసే క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా.?

Best Web Hosting Provider In India 2024

Five Rivers Meet in Andhrapradesh : శివుడు, విష్ణువు పూజలు అందుకునే ఆ పురాతన ప్రాంత విశిష్టత ఏంటో మీకు తెలుసా.? అయితే ఒక్కసారి ఇది చదవండి. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప జిల్లా కేంద్రం నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంటుంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’ అని, శైవులు దీనిని ‘మధ్య కైలాసం’ అని కొలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.

 

ట్రెండింగ్ వార్తలు

హరిహరాదుల క్షేత్రం..

శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పరీక్షిత్తు వంశాన్ని నిర్వీర్యం చేయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం మేరకు పుష్పగిరి కొండపై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చోళులు, పల్లవులు, కృష్ణ దేవరాయలు ఆ తర్వాత కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. కొండ మీద ఒకే ఆవరణలో చెన్న కేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి.

ఈ ఆవరణలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. పుష్పగిరిలోనే పాప వినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్ప నాథేశ్వరుడు, కమల సంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపునకు వెళ్ళలేరు. అప్పుడు ఇవతలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి. పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. జగద్గురువు ఆది శంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.

 

రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024