Best Web Hosting Provider In India 2024
Cubicles Season 3 Review: క్యూబికల్స్.. కార్పొరేట్ వరల్డ్ పరిచయం చేసిన సరికొత్త పదం. కార్పొరేట్ అంటే వారానికి ఐదు రోజుల పని.. లక్షల్లో జీతం.. వీకెండ్ పార్టీలు మాత్రమే అనుకునే వారికి ఈ క్యూబికల్స్ ((Cubicles)) మధ్య జరిగే సంఘర్షణను కళ్లకు కట్టేలా చూపిస్తున్న వెబ్ సిరీస్ క్యూబికల్స్. తాజాగా ఈ సిరీస్ మూడో సీజన్ శుక్రవారం (జనవరి 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
యూత్ మెచ్చే ఎన్నో సిరీస్ లను తెరకెక్కించిన టీవీఎఫ్ ( ది వైరల్ ఫీవర్) నిర్మించిన ఈ క్యూబికల్స్ (Cubicles).. కార్పొరేట్ ప్రపంచం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న సిరీస్ తాజాగా మూడో సీజన్ తో వచ్చింది. ఈ సీజన్ కూడా వినోదాన్ని పంచుతూనే చివర్లో ఎంతో భావోద్వేగానికి గురి చేసింది.
వెబ్ సిరీస్: క్యూబికల్స్ సీజన్ 3 (Cubicles Season 3)
ఓటీటీ: సోనీలివ్ (SonyLiv)
డైరెక్టర్: దివ్యాంషు మల్హోత్రా
నటీనటులు: అభిషేక్ చౌహాన్, బద్రీ చవాన్, ఆయుషి గుప్తా, కేతకీ కులకర్ణి, నిమిత్ కపూర్
క్యూబికల్స్ సీజన్ 3లో ఏం జరిగిందంటే?
పియూష్ ప్రజాపతి (అభిషేక్ చౌహాన్) అనే ఓ కార్పొరేట్ ఎంప్లాయీ చుట్టూ తిరిగే కథ ఇది. కథ సరైన విధానంలో చెప్పడం రావాలేగానీ.. ఓ కార్పొరేట్ ఆఫీస్ లో క్యూబికల్స్ అనే ఓ స్క్వేర్ బాక్స్ నుంచి కూడా అద్భుతమైన స్టోరీలు పుడతాయని చెప్పడానికి ఈ వెబ్ సిరీసే ఓ నిదర్శనం. తొలి రెండు సీజన్లలో ఈ పియూష్ ప్రజాపతి ఓ సాధారణ రిసోర్స్ గా జాయినై.. మెల్లగా టీమ్ లీడ్ వరకూ వెళ్లే జర్నీని చూపించింది.
ఇక ఇప్పుడు ఈ మూడో సీజన్ లో టీమ్ లీడ్ గా పియూష్ ప్రజాపతి ఆ క్యూబికల్స్ లో ఎదుర్కొనే సవాళ్లను చూపించే ప్రయత్నం చేశారు. ఒకప్పటి తన కొలీగ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ గౌతమ్ (బద్రీ చవాన్), శెట్టి(నిమిత్ కపూర్), సునయన(ఆయుషి గుప్తా) ఉన్న టీమ్ కే లీడ్ కావడం అనేది అతనికి ఎలాంటి సమస్యలను తెచ్చి పెట్టిందన్నది ఈ కొత్త సీజన్ లో చూడొచ్చు. ఓ సక్సెస్‌ఫుల్ ఎంప్లాయీ.. సక్సెస్‌ఫుల్ టీమ్ లీడ్ కావడం సాధ్యమేనా? ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలు ఏంటి? ఫ్రెండ్సే శత్రువులు ఎలా అవుతారన్నది ఎంతో వినోదాత్మకంగా, అదే సమయంలో భావోద్వేగానికి గురి చేసేలా డైరెక్టర్ దివ్యాంషు మల్హోత్రా చూపించాడు.
క్యూబికల్స్ సీజన్ 3 ఎలా ఉందంటే?
మొదటి రెండు సీజన్లలాగే క్యూబికల్స్ మూడో సీజన్ కూడా ఆకట్టుకునేలా సాగింది. ముఖ్యంగా కార్పొరేట్ ఎంప్లాయీస్ దీనికి సులువుగా కనెక్ట్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. తన టాలెంట్ తో పైనున్న వాళ్లను ఆకట్టుకుంటూ టీమ్ లోని సీనియర్ల కంటే ముందే టీమ్ లీడ్ గా మారిపోయిన పియూష్ ప్రజాపతి.. అదే టీమ్ సభ్యులతో పని చేయించుకోవడానికి పడే ఇబ్బందులను దాదాపు ప్రతి కార్పొరేట్ ఉద్యోగి తన కెరీర్లో ఏదో ఒక సమయంలో అనుభవించే ఉంటాడు అనిపిస్తుంది.
క్యూబికల్స్ మూడో సీజన్ మొత్తం ఓ లీడర్ గా ఎదగాలనుకుంటున్న పియూష్ ప్రజాపతి.. ఆ క్రమంలో ఎదుర్కొనే ఫెయిల్యూర్స్, వాటిని అధిగమించడానికి వేసే ఎత్తుగడలు, ఈ క్రమంలో తన ఫ్రెండ్స్ తోనే ఏర్పడే అభిప్రాయ భేదాలు, చివరికి లీడర్ గా ఎదిగినా.. ఓ ఫ్రెండ్ గా ఓడిపోయిన తీరును మనసుకు హత్తుకునేలా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
ప్రొఫెషనల్ జీవితంలో ముందడుగు వేయాలంటే.. ఎమోషనల్ గా కాకుండా లాజికల్ గా ఆలోచించాలనే ఓ సందేశాన్ని అంతర్లీనంగా చూపిస్తూ ఈ క్యూబికల్స్ మూడో సీజన్ సాగింది. ఓ ప్రాజెక్ట్ నుంచి మరో ప్రాజెక్ట్, ఓ డెడ్‌లైన్ నుంచి మరో డెడ్‌లైన్ మధ్య నడిచే కార్పొరేట్ లైఫ్ లోని అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు.
క్యూబికల్స్ సీజన్ 3.. ఎవరెలా చేశారంటే?
క్యూబికల్స్ వెబ్ సిరీస్ తొలి సీజన్ నుంచి మూడో సీజన్ వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుందంటే దానికి కారణం ఇందులోని నటీనటుల నటనే. ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో లీనమైపోయి నిజమైన కార్పొరేట్ ఎంప్లాయీస్ లాగే అత్యంత సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.
ఇందులోని ప్రధాన పాత్ర అయిన పియూష్ ప్రజాపతిగా కనిపించిన అభిషేక్ చౌహాన్ అన్నీ తానై ఈ సిరీస్ ను ముందుండి నడిపించాడు. అతనితోపాటు అతని టీమ్ లోని సభ్యులుగా నటించిన బద్రీ చవాన్, నిమిత్ కపూర్, ఆయుషి గుప్తాల నటనను మెచ్చుకోవాల్సిందే.