‘సీఎం వైయ‌స్ జగన్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’

Best Web Hosting Provider In India 2024

ఏ రాష్ట్రంలోనైనా ఐదేళ్లుగా అధికారంలో ఉంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మంచి పరిపాలన అందించిన పాలకపక్షాన్ని మరోసారి గెలిపించుకోవడానికి ఆ రాష్ట్ర ఓటర్లు ఎంతో ఆతృత, ఆసక్తితో మరుసటి ఎన్నికల కోసం ఎదురుచూస్తుంటారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాలు చూశాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వాతావరణమే నెలకొని ఉంది. 2019 మే 30న వృద్ధాప్య పింఛన్‌ పెంపు ఫైలుపై నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి సంతకంతో మొదలైన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలన దిగ్విజయంగా సాగుతోంది.

పేద, దిగువ మధ్య తరగతి ప్రజల అవసరాలు తీర్చడానికి, వారు అన్ని విధాలా తమ జీవితాలను మెరుగుపరుకోవడానికి వైఎస్సార్సీపీ సర్కారు వివిధ పథకాల కింద వారి బ్యాంకు ఖాతాల్లోకి ఇప్పటి వరకూ రూ. 2,46,000 కోట్లు బదిలీ చేసింది. అమ్మ ఒడి, రైతు భరోసా, వైయ‌స్ఆర్‌ ఆసరా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు వంటి జన సంక్షేమ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ లేదా నగదు బదిలీ) పథకాల ద్వారా గడచిన 55 నెలల్లో దాదాపు రెండున్నర లక్షల కోట్లు ప్రజలకు అందించింది వైఎస్‌ జగన్‌ సర్కారు.

ఇలాంటి ప్రజాహిత రాష్ట్ర సర్కారును మరోసారి గెలిపించి రాజన్న సంక్షేమ రాజ్యం ఇంకా పాతిక ముప్పయి సంవత్సరాలు కొనసాగేలా చూడడానికి ఆంధ్రప్రదేశ్‌ జనం ఉవ్విళ్లూరుతున్నారు. ప్రజలకు నిర్ణీత సమయంలో పై పథకాల కింద నగదు బదిలీ చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం ఏదోవిధంగా డబ్బును సమకూర్చుతోంది. అప్పుడప్పుడూ నిధులు కొరతతో వేతనాలు చెల్లింపు కొద్దిగా ఆలస్యమైనాగాని పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు పై పథకాల కింద డబ్బును వారి అకౌంట్లలోకి జమ చేయడం మాత్రం జాప్యం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఇలా అసంఘటిత రంగంలోని బలహీన వర్గాల ప్రజల ఆర్థిక అవసరాలు ఎన్ని కష్టాలకోర్చి అయినా తీర్చడమే తన కర్తవ్యంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

మార్చి రెండో వారంలోనే ఎన్నికల తేదీల ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చాలా ఏళ్ల తర్వాత 1999 నుంచీ పార్లమెంటు ఎన్నికలతోపాటు జరుగుతున్నాయి. ఇలా రాష్ట్ర శాసనసభ ఎలక్షన్లు వరుసగా అప్పటి నుంచి 2019 వరకూ ఐదుసార్లు జరిగాయి. లోక్‌ సభతోపాటు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే పనిలో ఆంధ్రప్రదేశ్‌కి జతగా పక్కనున్న ఒడిశా. ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ వచ్చి కొన్నేళ్ల క్రితం చేరాయి. ఈ ఎన్నికల నిర్వహణ చరిత్రను ఒక్కసారి వెనక్కి వెళ్లి పరిశీలిస్తే ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీలకు, 16వ లోక్‌ సభకు 2014లో, 2019లో కూడా మార్చి 15 లోపే ఎన్నికల తేదీలను (షెడ్యూలు) భారత ఎన్నికలసంఘం ప్రకటించిందని తెలుస్తుంది.

2014 ఎన్నికలకు అదే ఏడాది మార్చి 5న అన్ని తేదీలను (ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ మొదలు ఓట్ల లెక్కింపు వరకూ) ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. 17వ లోక్‌ సభ ఎన్నికలతోపాటు జరిగిన 15వ ఏపీ అసెంబ్లీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీల ఎన్నికల షెడ్యూలును 2019 మార్చి 10న ఎన్నికల సంఘం వెల్లడించింది. సాధారణ ఎన్నికల షెడ్యూలును ప్రకటించే మీడియా సమావేశంలో భారత ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ)  కీలక సమాచారం వెల్లడిస్తూ ప్రసంగిస్తారు. తేదీలు, ఇతర వివరాలను ఈసీఐ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో అందజేస్తారు. 2014 సాధారణ ఎన్నికలను 9 దశల్లో నిర్వహించారు. 2019 ఎన్నికలను 7 దశల్లో జరిపారు. 17వ లోక్‌ సభ ఎన్నికలతోపాటు జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మిగతా అన్ని ఫలితాలతోపాటు మే 23న ప్రకటించారు.

ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కనీవినీ ఎరగని అత్యధిక మెజారిటీ సాధించిన వైయ‌స్ఆర్‌ సర్కారు ఫలితాలొచ్చిన వారానికి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో కొలువుదీరింది. షెడ్యూలు ప్రకటించే సమయం ఇంకా 2 నెలలే ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వాన్ని మరో ఐదేళ్లకు ఎన్నుకోవడానికి ఆంధ్రా ఓటర్లు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వేడి చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకున్న పెద్ద తెలుగు రాష్ట్రంలో ఎన్నికల తేదీల ప్రకటన వెలువడిన తర్వాత మరోసారి పండగ వాతావరణం నెలకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి

Best Web Hosting Provider In India 2024