Best Web Hosting Provider In India 2024
Bandla Ganesh : సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గాంధీభవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజుల్లో పూర్తయిన సందర్భంగా పాలనపై తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా తెలంగాణలో పాలన జరుగుతుందని ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రజా పథం వైపునకు దూసుకుపోతున్నారన్నారు.
ట్రెండింగ్ వార్తలు
నిజాయితీ గల అధికారులకే కీలక బాధ్యతలు
బీఆర్ఎస్ నేతలపై బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లకు ఈర్ష్య పీక్ స్టేజ్ కు చేరుకుందని బండ్ల గణేష్ విమర్శించారు. వంద రోజుల తర్వాత పప్పులు ఉడకడం కాదు ఏకంగా బిర్యాని ఉడుకుతుంది హరీశ్ రావు అంటూ బండ్ల గణేష్ సెటైర్ వేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకి ఇచ్చిన హామీలపై కేంద్రంతో బీఆర్ఎస్ నేతలు కొట్లాడారా? అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రధాన మోదీని, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తున్నారన్నారు. నిజాయితీ గల అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించి ప్రజా పరిపాలనను చేస్తున్నారన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవదు : బండ్ల గణేష్
పార్లమెంట్ ఎన్నికలపై బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రపతి వస్తే కనీసం స్వాగతం పలకడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లలేదని బండ్ల గణేష్ గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణకి మాజీ రాష్ట్రపతి వచ్చినా….సీఎంగా రేవంత్ రెడ్డి వెళ్లి కలిసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. సామాన్య ప్రజలంతా ఇప్పుడు సచివాలయానికి వెళ్లవచ్చన్నారు . ప్రగతి భవన్ ను దళితుడు అయిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. తెలంగాణలో ఇన్ని మార్పులు జరుగుతుంటే హరీశ్ రావు , కేటీఆర్ ఎందుకు ఇంతగా ఆగమవుతున్నారని సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా