Best Web Hosting Provider In India 2024
Salaar Blockbuster Celebrations: ప్రభాస్ సలార్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఈ మాట వినాలని అతని అభిమానులు సుమారు ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి రెబల్ స్టార్ మూవీ హిట్, సూపర్ హిట్ కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్ గా నిలిచి వాళ్ల ఎదురుచూపులు ఫలించేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా 18 రోజుల్లో రూ.650 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిందీ మూవీ.
ట్రెండింగ్ వార్తలు
దీంతో సలార్ మూవీ టీమ్ సోమవారం (జనవరి 8) బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇందులో ప్రభాస్ తోపాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొన్నారు. టీమ్ అంతా కలిసి బ్లాక్‌బస్టర్ సలార్ అని రాసి ఉన్న కేక్ కట్ చేసింది. ఈ ఈవెంట్ కు ప్రభాస్ ఆల్ బ్లాక్ డ్రెస్ లో వచ్చాడు. సింపుల్ గా అయినా డాషింగ్ లుక్ లో అతడు కనిపించాడు.
ఎక్కడికి వెళ్లినా తనదైన లుక్ లో కనిపించడం ప్రభాస్ కు అలవాటు. ఈ సక్సెస్ మీట్ కు కూడా అతడు అలాగే వచ్చాడు. ఈ ఈవెంట్లో సలార్ టీమ్ మొత్తం ఎంతో ఉల్లాసంగా కనిపించింది. రికార్డు బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్ అని ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్ ముందు నిల్చొని ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ కేక్ కట్ చేశారు. కేక్ కటింగ్ సమయంలో ప్రభాస్ పెద్దగా నవ్వుతూ కనిపించాడు.
చాలా ఏళ్ల తర్వాత ఓ హిట్ కొట్టానన్న ఆనందం అతనిలో కనిపించింది. సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.650 కోట్లకుపైగా వసూలు చేసినట్లు ఆ మూవీ టీమ్ వెల్లడించింది. ఇండియాలోనూ రూ.400 కోట్ల మార్క్ కు చేరువవుతోంది.
సలార్ 18వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు
సలార్ 18వ రోజు ఇండియాలో రూ.2.25 కోట్లు వసూలు చేసింది. దీంతో 18 రోజుల్లో కలిపి ఇండియాలోనే ఈ మూవీ రూ.395.5 కోట్లు రాబట్టింది. మరో రెండు రోజుల్లో సలార్ ఇండియా కలెక్షన్లు రూ.400 కోట్ల మార్క్ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.270 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సలార్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా అంతకు రెట్టింపు వసూళ్లు సాధించింది.
ముఖ్యంగా తెలుగులో రిలీజ్ అయిన రోజు నుంచే సలార్ రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. 18వ రోజు కూడా తెలుగులో రూ.0.75 కోట్లు, హిందీలో రూ.1.29 కోట్లు వసూలు చేసింది. దీంతో 18 రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.215.1 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించగా.. హిందీలో రూ.145.44 కోట్లు వసూలు చేసింది. ఇక తమిళంలో రూ.18.7 కోట్లు వచ్చాయి.
ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన సలార్ మూవీ.. ఇక ఇప్పుడు స్పెయిన్, జపాన్ లలోనూ రిలీజ్ కానుంది. స్పానిష్ భాషలో లాటిన్ అమెరికాలో మార్చి 7న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
సలార్ మూవీలో ప్రభాస్ తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు నటించారు. నిజానికి ఈ సినిమా కలెక్షన్లు ఇప్పటికే మరింత పెరిగేవి. కానీ కన్నడలో ఆశించిన మేర వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇక ఏపీలోనూ కొన్ని చోట్ల నష్టాలు తప్పవనీ అంటున్నారు.