Best Web Hosting Provider In India 2024
Medico Preethi Case: వరంగల్ కేఎంసీలో పీజీ వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య కేసులో సీనియర్ విద్యార్ధి సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ ధృవీకరించింది. పీజీ మొదటి సంవత్సరం వైద్య విద్యార్ధినిపై సీనియర్ వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు కమిటీ సభ్యులు నిర్ధారించారు.
ట్రెండింగ్ వార్తలు
కాకతీయ వైద్య కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రీతి గత ఏడాది ఫిబ్రవరిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
సైఫ్‌పై గతంలో విధించిన సస్పెన్షన్ కాలం ఈ ఏడాది మార్చి 3వ తేదీతో ముగియనుంది. కమిటీ నివేదిక నేపథ్యంలో మరో 97 రోజులపాటు పొడిగించింది. గత ఏడాది ఫిబ్రవరి 22న సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో గుర్తు తెలియని ఇంజెక్షన చేసుకుని మెడికో ప్రీతి ఎంజీఎం ఆసుపత్రిలో ఆత్మహత్యకు యత్నించింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఫిబ్రవరి 26న నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ కేసులో పోలీసులు సీనియర్ పీజీ విద్యార్ధి సైఫ్‌ను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఏడాదిపాటు తరగతులకు హాజరు కాకుండా నిషేధిస్తూ కేఎంసీ ర్యాగింగ్ నిరోధక కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో నిందితుడు సైఫ్ హైకోర్టును ఆశ్రయించగా… తాత్కాలికంగా సస్పెన్షన్‌ను ఎత్తి వేసింది.
గత ఏడాది నవంబరు 9న హైకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సైఫ్ హాజరై వివరణ ఇచ్చాడు. దీనిపై చర్చించిన కమిటీ సభ్యులు.. సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తమేనని న్యాయ స్థానానికి నివేదిక రూపంలో సమర్పించారు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ నిరోధక కమిటీ విధించిన సస్పెన్షన్ కొనసాగించ వచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.