Best Web Hosting Provider In India 2024
CBN And Pawan: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, సన్నద్ధతపై విజయవాడ వచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌తో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగుల్ని తప్పించాలని కోరారు. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని కోరారు.
ట్రెండింగ్ వార్తలు
ప్రజల్లో ఉన్న తిరుగుబాటు చూసి ప్రతి చోట దొంగ ఓట్లను చేర్పించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైందని చంద్ర బాబు అరోపించారు. చంద్రగిరిలో 1.10లక్షల ఓట్ల కోసం ఫాం-6లను ఇస్తే, ఇప్పటికే 33వేల ఓట్లను అమోదించారని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన అధికారి గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, కేంద్ర హోంమంత్రిని భద్రతా కోసం అభ్యర్థించాల్సిన పరిస్థితి ఏపీలో ఉందని గుర్తు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణలో సమర్థులైన అధికారుల్ని వినియోగించాలని, ఏపీలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులు జాబితాను ఈసీకి అందచేసినట్టు తెలిపారు.
జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణలో టీచర్లు, అనుభవం ఉన్న ఉద్యోగుల్ని ఎన్నికల నిర్వహణలో వినియోగిస్తారని, వారిని కాకుండా ఏపీలో సచివాలయ ఉద్యోగులతో ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతున్నారని, ప్రభుత్వం చేసే తప్పుల్ని వారితో చేయించాలని భావిస్తున్నారని సీఈసీకి చెప్పామన్నారు. బిఎల్వోలుగా ప్రభుత్వ అధికారులు పనిచేసేవారని, వారు విధులు చేయకపోతే కఠిన చర్యలు తీసుకునే వారిమని బాబు గుర్తు చేశారు.
ప్రస్తుతం బిఎల్వోలుగా 2600మంది మహిళా పోలీసుల్ని నియమించారని.. వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ నుంచి అంతా ప్రచారం చేస్తున్నారని వారిని ఎన్నికల విధుల్లో ఎలా వినియోగిస్తారని ప్రశ్నించామన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తల మీద 6,7వేల కేసులు ఉన్నాయని, పుంగనూరులో 200మంది జైలుకు వెళ్లారని, బైండోవర్ కేసులు పెట్టి ఎమ్మార్వో వద్ద సరెండర్ చేస్తున్నారని, ఎన్నికల్లో పని చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఇదే జరిగితే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. తెలంగాణలో ఒక్క రోజులో జరిగినట్టు ఏపీలో కూడా స్మూత్‌గా ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు.
దేశంలో ఈ తరహా సమస్యలు ఏపీలో మాత్రమే వస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అన్ని కఠిన చర్యలు తీసుకుంటామని సీఈసీ తమకు హామీ ఇచ్చారని బాబు చెప్పారు.
ఎన్నికలకు ముందే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్లను పంపాలని, పటిష్ట నిఘా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు బాబు చెప్పారు. ప్రజాస్వామ్యం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఒక్క ఓటు దొంగ ఓటు ఉన్నా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామన్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లి శిక్ష పడేలా చేస్తామన్నారు. నాలుగు కోట్ల మందికి కేంద్ర ఎన్నికల సంఘం భరోసా ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏకపక్షంగా ఓట్లు తొలగించడం సరికాదన్నారు. నోటీసులు ఇచ్చి ఓట్లు తీసేయాలని, ఎన్నికల సంఘం వెరిఫై చేసిన తర్వాతే ఓట్లు తొలగించాలన్నారు. ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిన వారికి ఓటు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు.
ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటారని, ధృవీకరించిన తర్వాతే ఓటు తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగుల్ని ఎన్నికల విధుల్లో వినియోగించకూడదని, దేశమంతటా ఏమి చేస్తున్నారే అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారుల తీరు మీద ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. బోగస్ ఓట్లపై పూర్తి వివరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.
ఈసీకి అందే ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. సిఎస్ ర్యాంకులో ఉన్న అధికారి కేంద్రాన్ని భద్రత కోరే పరిస్థితి ఏపీలో మాత్రమే ఉందన్నారు. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈసీ భరోసాపై సంతోషం… పవన్ కళ్యాణ్
ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని కేంద్రం నిర్ణయించుకోవడం వల్లే ఈసీ బృందం పూర్తి స్థాయిలో విజయవాడ తరలి వచ్చిందన్నారు. ప్రతి నియోజక వర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్ల తొలగింపు మీద దృష్టి పెట్టాలని కోరినట్టు చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బైండోవర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.
అధికారుల నియామకం, బదిలీల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. వాలంటీర్ల, సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరినట్టు చెప్పారు. ఏపీలో దళితులు నామినేషన్లు వేసే పరిస్థితి లేదని చెప్పామని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం మారిపోతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.