
Best Web Hosting Provider In India 2024

రైతులు పండించిన పంట ఇంటికి వచ్చే సమయంలో సంక్రాంతి పండగ జరుగుతుంది. శ్రేయస్సుకు ప్రతీకగా పండుగను చేస్తారు. ఉత్తరాయణ కాలం మకర సంక్రాంతి. ఈ పండుగ చాలా ఉత్సాహంగా నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకొంటారు. పూజలు చేస్తారు. ఎద్దులకు స్నానాలు చేయించి.. కొమ్ములకు నూనె రాస్తారు. వాటిని కూడా దైవంగా భావిస్తారు. ఇంటి తలుపులను పైరుతో అలంకరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ట్రెండింగ్ వార్తలు
కొన్ని చోట్ల రన్నింగ్ కాంపిటీషన్, రెజ్లింగ్, మహిళలతో జానపద నృత్యం, గాలిపటాలు ఎగురవేయడం, ఇతర ఆచారాలు ఉంటాయి. ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేక నమ్మకం, చరిత్ర ఉంటుంది. కొత్త బట్టలు కట్టుకుని ఇంటింటికీ నువ్వుల బెల్లం పంచి అందరి నోళ్లు తీపి చేస్తారు. పిల్లలు, పెద్దలు కలిసి గాలిపటాలు ఎగురవేస్తారు. అయితే ఇలా గాలిపటాలు ఎగురేసేందుకు కారణాలేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా?
రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగురవేయడం సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేకం. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కూడా జరుపుతుంటారు. హిందూ పండుగలలో ఒకటైన మకర సంక్రాంతిని సూర్య భగవానుడికి అంకితం చేసిన పండుగ అని అంటారు. సూర్య భగవానుని పూజించే ఈ పండుగ ప్రారంభం వసంత ఆగమనాన్ని సూచిస్తుంది. విభిన్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో కూడిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరి మనసులోనూ, ఇంట్లోనూ కొత్తదనాన్ని నింపుతుంది. ఈ సమయంలో ఎగిరేసే గాలిపటాలకు ప్రత్యేకత ఉంది.
మకర సంక్రాంతి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతాయి. సాధారణంగా చలికాలంలో చాలా క్రిములు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల చాలా జబ్బులు, జ్వరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన మకర సంక్రాంతి సమయంలో ప్రకాశవంతమైన సూర్యకిరణాలు పొందడం ద్వారా బ్యాక్టీరియా సహజంగా నాశనం అవుతుంది. అందుకే గాలిపటాలు ఎగురవేస్తారు. సూర్యుడి కిరణాలు నేరుగా మన శరీరం మీద పడతాయి. చాలా రోగాలను దగ్గరకు రాకుండా చేస్తాయి.
అందుకే గాలిపటాలను సంక్రాంతినాడు ఎగరవేయాలని చెబుతారు. దీని వెనక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడి నుంచి వచ్చే కాంతి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఈ రోజున శరీరం మీద సూర్య కిరణాలు పడటం అమృతం లాంటివని అంటారు. వివిధ వ్యాధులను నయం చేసే శక్తి ఉంది.
ఈ గాలిపటాలు ఎగురవేయడం వెనక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మకర సంక్రాంతి, ఉత్తరాయణ సమయంలో గాలిపటాలు ఎగరేస్తే స్వర్గానికి వెళ్తారని నమ్మకం ఉంది. మంచి జీవితాన్ని, సంతోషాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాలిపటం ఎగురవేస్తారట. అలాగే ఉత్తరాయణ సమయంలో నీలాకాశంలో గాలిపటం ఎగరేయడం వలన మనసకు హాయిగా ఉంటుందని కొందరు చెబుతారు.