Best Web Hosting Provider In India 2024

Chandrababu Strategy: వైసీపీలో అసంతృప్తితో ఉన్నవారిని టీడీపీ వైపు ఆకర్షించే ప్రయత్నాల్లో టీడీపీ తలమునకలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును నిరసిస్తూ ప్రత్యామ్నయాలు వెదుకుతున్న వైసీపీ నాయకుల్ని గుర్తించే పనిలో టీడీపీ తలమునకలై ఉంది.
ట్రెండింగ్ వార్తలు
గత వారం ఎవరు అడగకుండానే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. చంద్రబాబుతో ముందస్తు అపాయింట్‌మెంట్ లేకపోయినా నేరుగా వెళ్లి బాబును కలవడానికి వచ్చినట్టు చెప్పారు. సి.రామచంద్రయ్య గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు.
ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ నాయకత్వం మీద అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోవడం, పార్టీలో తగిన ప్రాధాన్యత లేకపోవడంతోనే పార్టీని వీడినట్టు చెబుతున్నారు. ఏపీలో అప్పుల భారం పదిలక్షల కోట్లను దాటేసిందని రామచంద్రయ్య ఆరోపిస్తున్నారు. ఆర్ధిక పరిస్థితిని గాడిన పెట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
2019లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత పలువురు నేతలు వైసీపీలో చేరారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి వారు కూడా టీడీపీలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. డొక్కా వంటి నేతలకు టీడీపీ ఏమి అన్యాయం చేసిందని చంద్రబాబు ఇటీవల ప్రశ్నించారు.
పార్టీలో సముచిత స్థానం కల్పించినా.. అధికారంలో లేకపోవడంతోనే పార్టీని విడిచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా పార్టీని వీడిన వారంతా వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు వీడి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకునే విషయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. అవకాశవాదంతో పార్టీలోకి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉంటామని చంద్రబాబు చెబుతున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి పనికొచ్చే నాయకులను స్వాగతిస్తామని చెప్పారు.
వైసీపీ నాయకత్వంతో అసంతృప్తితో ఉన్న వారిలో పరివర్తన కనిపిస్తోందని,ఎమ్మెల్సీ పదవిని కూడా కాదనుకుని రామచంద్రయ్య టీడీపీలోకి రావడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.వైసీపీలో ఏకపక్ష విధానాలపై ఆ పార్టీ నాయకత్వంలో నెలకొన్న అసంతృప్తిని అందిపుచ్చుకోవాలని టీడీపీ భావిస్తోంది.
టీడీపీని బలోపేతం చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోతుందని ప్రజల్లో ప్రచారం చేయడానికి వీలుగా ఏ అవకాశం దొరికినా అందిపుచ్చుకోవాలని టీడీపీ అధ్యక్షుడు భావిస్తున్నారు. ఆ పార్టీని వీడి ఎవరు టీడీపీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నా ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నారు.