Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/kmm_1704868101964_1704868119674.jpg)
Khammam Nama Future: పార్లమెంటుకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హస్తం హవా ముందు కారు పార్టీ తట్టుకుంటుందా..? అనే ప్రశ్న ఉదయిస్తోంది. బిఆర్‌ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా ఈ సారి ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో వామపక్షాలు, టీడీపీ ఓట్లు కూడా చాలా కీలకం కానున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
2009, 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానానికి తిరుగులేని విజయాలను నమోదు చేసి, రెండు దఫాలు లోక్‌సభ పక్షనేతగా పని చేసిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు 2024 పార్లమెంటు ఎన్నికల్లో అసలైన పరీక్షను ఎదుర్కోబోతున్నారన్న చర్చ జరుగుతోంది.
హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో రాబోయే పార్లమెటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్దిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ, లోక్‌సభలో ప్లోర్ లీడర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న నామ నాగేశ్వరరావు పేరును దాదాపు ఖరారు చేశారు.
గడిచిన ఎన్నికలకు ప్రస్తుతం జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలకు చాలా తేడా ఉండనుంది. బిఆర్‌ఎస్‌లో క్రియాశీలక నాయకులుగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావును బిఆర్‌ఎస్ అధిష్టానం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురిచేయడంతో వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరడంతో రాష్ట్రంలో కారు పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంది.
వారిద్దరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్దులను చిత్తుగా ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించారు. పదింట తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్దులను గెలిపించుకుంది. ఈ సునామీలో ఖమ్మం మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్ సైతం కాంగ్రెస్ అభ్యర్ది తుమ్మల నాగేశ్వరరావు చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు.
ఖమ్మంతో పాటు పాలేరు, సత్తుపల్లి, మధిర, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్దులు కాంగ్రెస్ అభ్యర్దులకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో అతిత్వరలోనే జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామ నాగేశ్వరరావును బరిలో దింపుతున్న క్రమంలో హస్తం పార్టీ హవా ముందు ఎంపీ నామ తట్టుకుంటారా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ముగ్గురు మంత్రుల ముందు నెగ్గేనా..?
ప్రస్తుతం ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమి పాలై ఉన్నారు. అది కూడా భారీ తేడాతోనే ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గకముందే పార్లమెంటు ఎన్నికలు వస్తుండటంతో నిజంగా ఎంపీ అభ్యర్దిగా బరిలో దిగుతున్న నామకు నిజమైన పరీక్షేనని చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్ తరపున ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి కనిపిస్తుండగా కాంగ్రెస్ తరపున డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో పాటు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. ప్ర
స్తుత బలాబలాను పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్దిగా బరిలో నిలిచే వ్యక్తికి, బీఆర్‌ఎస్ అభ్యర్దికి హోరా హోరీ పోరు ఉంటుందా..? వార్ వన్ సైడేనా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. గెలుపు మాదేనని ఎవరికి వారే చెప్పుకుంటున్నా ఖమ్మం లోక్‌సభ బరిలో గెలిచే వారికి వామపక్షాల ఓట్లు కూడా చాలా కీలకం కానున్నాయి.
దాదాపు ఏడు నియోజకవర్గాల్లోనూ ఓట్ బ్యాంకు కలిగి ఉన్న వామ పక్షాలు పార్లమెంటు బరిలో ఉంటాయో లేక పొత్తులు పెట్టుకుంటారో చూడాలి. ప్రస్తుతం ఉన్నట్టుగానే టీడీపీ కాంగ్రెస్‌తోనే పయనిస్తే బీఆర్‌ఎస్‌కు పెను సవాల్‌గా మారనుంది.
(రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఖమ్మం)