Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/01/gw_1704872206906_1704872232642.jpg)
Gorantla Madhav: హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎంత వేగంగా రాజకీయాల్లో ఎదిగారో అంతే వేగంగా కిందకు జారిపోయారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి టిక్కెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో తాడేపల్లిలో తచ్చట్లాడుతున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్ మీద ప్రస్తుతానికి ఎలాంటి భరోసా దక్కలేదు.
ట్రెండింగ్ వార్తలు
సామాజిక లెక్కల్లో మెరిసి….
2019 సార్వత్రిక ఎన్నికల్లో సామాజిక లెక్కల్లో భాగంగా అనూహ్యంగా అదృష్టం వరించిన వారిలో గోరంట్ల మాధవ్ ఒకరు. అయితే ఆ స్థానం అంత సులువుగా ఏమి దక్కలేదు.
2019 మార్చి 22, 23 తేదీల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశం కోసం ఎన్నికల కమిషన్ చుట్టూ మాధవ్ చక్కర్లు కొట్టారు. డ్యూటీ నుంచి రిలీవ్ చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేశారు.
ఎన్నికల సంఘం తరపున సీఈఓగా ఉన్న గోపాల కృష్ణ ద్వివేది జోక్యంతో గోరంట్ల మాధవ్‌కు పోటీ చేసే అవకాశం దక్కింది. తనను రిలీవ్ చేయకుండా పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు వేధిస్తున్నారని, ట్రిబ్యునల్ ఉత్తర్వులు అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిందేనని, ఆ బాధ్యత ఎన్నికల సంఘం చూస్తుందని సీఈఓ హామీ ఇవ్వడంతో మాధవ్‌కు లైన్ క్లియర్ అయ్యింది.
గోరంట్ల మాధవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాత రిలీవింగ్ ఆర్డర్స్ సులువుగా వెలువడలేదు. రకరకాల స్థాయిల్లో అటంకాలు ఎదురైనా ఎన్నికల కమిషన్ నిరంతర జోక్యం, పర్యవేక్షణతో నామినేషన్ వేయడానికి ఒక్కరోజు ముందు ఆయన విధుల నుంచి విడుదలయ్యారు. అప్పటికే ఆయనపై శాఖపరమైన విచారణ జరుగుతోందని అభ్యంతరాలు వ్యక్తమైనా కోర్టు ఆదేశాలు అమలు చేయాలని తేల్చి చెప్పడంతో మాధవ్ ఎన్నికల బరిలో నిలిచారుర.
భార్యను బరిలో పెట్టాలనుకుని…..
నామినేషన్లు వేయడానికి చివరి తేదీలోపు తనను సర్వీస్ నుంచి రిలీవ్ చేయరని ఫిక్స్ అయిపోయిన గోరంట్ల, భార్య బబితాను నిలబెట్టాలని భావించారు. నామినేషన్ల చివరి రోజు హై కోర్టు జోక్యంతో విధుల నుంచి బయట పడి ఎంపీ అయ్యాడు. మధ్యలో చాలా జరిగినా కేవలం ఎన్నికల సంఘం పుణ్యాన మాత్రమే అతను ఎంపీ అయ్యాడు. ఈసీ ఏ మాత్రం పట్టించుకోకపోయినా కథ వేరెలా ఉండేది.
గెలిచిన తర్వాత మరో రూపం…
2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈసీ జోక్యంతో పోటీ చేసి గెలిచిన మాధవ్ ఆ తర్వాత పూర్తి భిన్నంగా వ్యవహరించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే తన రూపాన్ని ప్రదర్శించారు.
అనంతపురం జిల్లా పెనుగొండలో నిర్మించిన కియా కార్స్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో అందరి ఆయన ప్రవర్తన చర్చనీయాంశమైంది. 2019 జులై 16న కియా కార్ల బుకింగ్ ప్రారంభించి జులై 24న ముఖ్యమంత్రి సమక్షంలో తొలి మోడల్ సెల్టోస్ ని మార్కెట్ లోకి ప్రవేశ పెట్టాలని భావించింది.
చివరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దయింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో దానిని వాయిదా వేశారు. ఆ తర్వాత ఆగస్ట్ 8కి ముహూర్తం ఖరారు చేశారు. కియా ప్రతినిధులు స్వయంగా ఆహ్వానించడంతో సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. కియా కార్ రోల్ ఔట్ కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.
2019 జులై 5వ తేదీన ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చిన సీఎం 6,7 తేదీలలో ఢిల్లీ పర్యటన ఉండటంతో 8న కడప, అనంతపురం లలో పర్యటిస్తానని ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో గోదావరి వరదల కారణంగా కియా పర్యటన రద్దు చేసుకున్నారు.
చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించిన ఫ్యాక్టరీకి తాను వెళ్లడం ఏమిటని భావించారో, మరేదైనా కారణం ఉందో కానీ సీఎం స్థానంలో ఆర్థిక మంత్రి బుగ్గన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ప్రసంగంలో కియా యాజమాన్యానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. కియా కోసం 745 ఎకరాల భూమి ఇచ్చామని, మరో 145 ఎకరాలు ఇస్తామని., తమ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని హెచ్చరించే ధోరణిలో వేదిక మీద ప్రకటించారు.
అంతకు ముందు ఎంపీ గోరంట్ల మాధవ్., కియా ఇండియా హెడ్ వినోద్ భట్ తో అనుచితంగా ప్రవర్తించారు. వేదిక మీదే అసహనం వ్యక్తం చేశారు. తనను వేదికపై మాట్లాడేందుకు పిలవలేదని అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా కియా ఉత్పత్తి చేసిన తొలి కార్ మీద అనుచిత వ్యాఖ్యలు రాశారు. కియా ప్లాంట్ నుంచి విడుదల చేసిన తొలి కార్ మీద ” కియా రోల్డ్ ఔట్ బట్ అవర్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ రూల్డ్ ఔట్ అని రాసి మాధవ్ సంతకం చేశారు.
దక్షిణ కొరియా ప్రభుత్వ రాయబారి., కియా ఎండీల సమక్షంలో మాధవ్ రచ్చ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వైరల్ వీడియోలతో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు గెలిస్తే వారిలో కేవలం గోరంట్ల మాధవ్ ఒక్కరే ఎనలేని పాపులారిటీ సాధించారు. చివరకు అదే ఆయనకు కనీసం టిక్కెట్ గ్యారంటీ కూడా లేకుండా చేసిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.